కరోనా వైరస్ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. వదంతులు, నిరాధార ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. కొవిడ్ -19 వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు 0866-2410978 కు తెలియజేయాలని కోరారు. కొవిడ్-19 లక్షణాలేమైనా ఉంటే వెంటనే మాస్క్‌ను ధరించాలన్నారు. సమీప ప్రభుత్వాసుపత్రికి ఉచిత 108 అంబులెన్స్‌లో చేరుకోవాలని సూచించారు.
ఇప్పటి వరకు 361 మంది వైద్యుల పరిశీలనలో ఉన్నారన్నారు. 130 మంది ఇళ్లల్లోనే వైద్యుల పరిశీలనలో ఉండగా.. 218 మందికి 28 రోజుల అబ్జర్వేషన్ పూర్తయ్యిందన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 13 మంది పరిస్థితి స్థిమితంగానే ఉందన్నారు. 24 మంది శాంపిళ్లను ల్యాబ్‌కు పంపగా 11 మందికి నెగటివ్‌గా తేలిందన్నారు. మిగతా 13 మంది శాంపిళ్లకు సంబంధించి ఫలితాలు రావాల్సి ఉందన్నారు.