రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గరిష్ఠ స్థాయికి చేరింది. ఇదే సమయంలో సాయంత్రం గరిష్ఠ వినియోగం సమయంలో యూనిట్ రూ.20కి డిస్కంలు కొనుక్కోవాల్సి వస్తోంది. ఈ నెల 17న గ్రిడ్ డిమాండ్ రికార్డు స్థాయిలో 11,694 మెగావాట్లుగా నమోదైంది. 2021 మార్చి 11న నమోదైన 10,724 మెగావాట్లు ఇప్పటివరకు గరిష్ఠ డిమాండ్‌గా ఉంది. వ్యవసాయ విద్యుత్ వినియోగం, ఉష్ణోగ్రతలు పెరగటంతో విద్యుత్ వాడకం పెరుగుతోంది. మార్చి ఒకటో తేదీ నుంచి రోజూ గ్రిడ్ గరిష్ఠ డిమాండ్ 11వేల మెగావాట్లకు తగ్గడం లేదు.
పెరిగిన విద్యుత్ కొనుగోలు వ్యయం:రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఆదివారం 230.22 మిలియన్ యూనిట్లకు (ఎంయూ) చేరింది. వారం రోజులుగా డిమాండ్ 225-230 ఎంయూల మధ్య ఉంటోంది. జెన్‌కో, హిందూజాల నుంచి 86.64 ఎంయూల థర్మల్ విద్యుత్ వస్తోంది. సౌరవిద్యుత్ 14.3 ఎంయూలు, పవన విద్యుత్ 8.16 ఎంయూల వరకు అందింది. వీటితోపాటు ఎన్‌టీపీసీ నుంచి వచ్చే విద్యుత్‌పోను డిమాండ్ సర్దుబాటుకు ప్రతి రోజూ 45-50 ఎంయూల విద్యుత్‌ను బహిరంగ మార్కెట్‌నుంచి డిస్కంలు కొనుక్కోవాల్సి వస్తోంది. మన పొరుగు రాష్ట్రాలు కూడా బహిరంగ మార్కెట్‌పై ఆధారపడటంతో పోటీ పెరిగి యూనిట్ ధరను ఉత్పత్తి సంస్థలు పెంచేశాయి. సగటు యూనిట్ విద్యుత్ కొనుగోలు వ్యయం రూ.6.50కు చేరింది. గత నెల యూనిట్‌కు సగటున రూ.4.50 వంతున డిస్కంలు చెల్లించాయి. సాయంత్రం గరిష్ఠ వినియోగం సమయంలో యూనిట్ రూ.20కి కొంటున్నట్లు అధికారులు తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలుకు రోజుకు రూ.30-35 కోట్లు వెచ్చిస్తున్నారు.