'దిశ’ అత్యాచార(disha case) కేసు నిందితుల ఎన్‌కౌంటర్ ఉదంతంపై ఏర్పాటైన జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్(justice sirpurkar commission) విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీ ఎండీ, అప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కమిషన్ రెండో రోజూ విచారిస్తోంది. కమిషన్ సభ్యులు అడిగి ప్రశ్నలకు సజ్జనార్ సమాధానమిస్తున్నారు. మొదటి రోజు జరిగిన విచారణలో సజ్జనార్ ఈ అంశాలను వెల్లడించారు. దిశ హత్యాచార ఘటన గురించి.. తెలంగాణలోని శంషాబాద్ డీసీపీ తనకు చెప్పాడని.. కేసును అతనే పర్యవేక్షించాడని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (RTC MD Sajjanar) సిర్పుర్కర్ కమిషన్ (justice sirpurkar commission)కు వివరించారు. నిందితులను గాలించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారని.. కేసు పురోగతి గురించి శంషాబాద్ డీసీపీ ప్రతి రోజు ఉదయం జరిగే సెట్ కాన్ఫరెన్స్‌లో చెప్పాడని సజ్జనార్ కమిషన్‌కు తెలిపారు. ట్రాఫిక్ పర్యవేక్షణలో భాగంగా 2019 నవంబర్ 29న శంషాబాద్ విమానాశ్రయం వరకు వెళ్లి వస్తుంటే.. అదే రోజు నిందితులను పట్టుకున్న విషయాన్ని డీసీపీ చెప్పడంతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు మీడియాకు తెలిపానని కమిషన్ తరఫు న్యాయవాది అడిగిన ప్రశ్నకు సజ్జనార్ సమాధానమిచ్చారు.
కమిషన్ సభ్యులు ఇప్పటికే హోంశాఖ కార్యదర్శి రవిగుప్త, సిట్ ఛైర్మన్ మహేశ్ భగవత్, దర్యాప్తు అధికారి సురేందర్ రెడ్డితో పాటు పోస్టుమార్టం నిర్వహించిన దిల్లీ ఎయిమ్స్, గాంధీ ఆస్పత్రి వైద్యులు, క్లూస్ టీం అధికారి వెంకన్నను విచారించారు. మృతుల కుటుంబ సభ్యుల వాంగ్మూలం కూడా నమోదు చేశారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్(Disha encounter case) సయమంలో ఎదురుకాల్పుల్లో గాయపడ్డ పోలీసులకు చికిత్స అందించిన కేర్ ఆస్పత్రి వైద్యుడిని కూడా కమిషన్ విచారించింది. షాద్‌నగర్ కోర్టు న్యాయమూర్తి శ్యాంప్రసాద్ రావును కూడా కమిషన్ విచారించింది.
సంచలనం సృష్టించిన ఘటన
2019, నవంబర్ 27న జరిగిన దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. షాద్‌నగర్ ఓఆర్‌ఆర్ టోల్‌గేట్‌కు 50మీటర్ల దూరంలో అత్యాచారం చేసిన నిందితులు అనంతరం హత్య చేశారు. మృతదేహాన్ని వారి లారీలో షాద్‌నగర్ మండలం చటాన్‌పల్లి జాతీయ రహదారిపై ఉన్న వంతెన కిందకు తీసుకెళ్లి డీజిల్ పోసి నిప్పంటించారు. నిందితులను 2019, డిసెంబర్ 6న తెల్లవారుజామున పోలీసుల ఎన్‌కౌంటర్ చేశారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ (Scene Reconstruction) చేస్తుండగా పోలీసులు వద్ద ఆయుధాలు తీసుకుని పారిపోయేందుకు యత్నించిన నిందితులపై కాల్పులు (Encounter) జరిపినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్ (Encounter)లో మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. దిశ హత్యాచార ఘటన, నిందితుల ఎన్‌కౌంటర్ (Encounter) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పలువురు మానవ హక్కుల సంఘాలు సుప్రీంకోర్టు, హైకోర్టును ఆశ్రయించాయి. ఎన్‌కౌంటర్ (Encounter) ఘటనపై సుప్రీంకోర్టు 2019 డిసెంబర్ 12న ముగ్గురు సభ్యులతో న్యాయ కమిషన్ ఏర్పాటు చేసి ఆర్నెళ్ల గడువు విధించింది.
త్రిసభ్య కమిషన్ విచారణ
ఫిబ్రవరి 3న దిశ ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య కమిషన్ విచారణ ప్రారంభించింది. సిర్పూర్కర్ కమిషన్ ఆర్నెళ్లలో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉన్నప్పటికీ.. కరోనా కారణంగా విచారణ వాయిదా పడుతూ వచ్చింది. ఆర్నెళ్లలో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు.. సిర్పూర్కర్ కమిషన్‌ను ఆదేశించడంతో ఆ మేరకు విచారణ కొనసాగుతోంది. దిశ కుటుంబ సభ్యులు, ఎన్కౌంటర్లో చనిపోయిన కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించింది. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులతో పాటు.. పంచనామా నిర్వహించిన రెవెన్యూ అధికారులను, వైద్యులను ప్రశ్నించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి నివేదికను తీసుకుంది. వారితో ఉన్నతాధికారులను, సిట్ ఛైర్మన్లను కూడా విచారించింది.
ఇదీ చదవండి:నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టులో విచారణ