అమరావతినే పూర్తి స్థాయి రాజధానిగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. రాజధాని మార్పును ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ ప్రజలే వ్యతిరేకిస్తున్నారని అన్నారు. బుధవారం విజయవాడ ఆంధ్రరత్న భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు.
మూడు రాజధానులు అంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రక తప్పిదం అని తులసిరెడ్డి అన్నారు. అమరావతి పవిత్ర కృష్ణా నది ఒడ్డున, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉందని వివరించారు. అలాగే సచివాలయ భవనం కూడా పూర్తయిందని తెలిపారు. నాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ కూడా అమరావతిని స్వాగతించారని... వైకాపా నాయకులు కూడా అనేకసార్లు రాజధాని ఒక్కటే ఉంటుందని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాజధానిగా అమరావతినే కొనసాగించేలా జగన్కు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవున్ని కోరుతున్నామని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. అమరావతి జేఏసీ గురువారం నిర్వహించబోతున్న చలో అమరావతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పాల్గొంటుందన్నారు.