రైతు ఆత్మహత్యలపై ఎన్సీఆర్బీ(NCRB) నివేదికలోని అంకెలు తప్పని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. 2020 ఏడాదిలో రాష్ట్రంలో కేవలం 225 మంది రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారని స్పష్టం చేశారు. 889 మంది రైతులు చనిపోయినట్లు ఎన్సీఆర్బీ నివేదికలో తెలపడం సరైంది కాదన్నారు.
రైతుల చావులకు నిర్దిష్ట కారణాలేమిటనే విషయాన్ని ఎన్సీఆర్బీ చెప్పలేదని, కేవలం పోలీసుల నివేదిక ప్రకారం దీన్ని వెల్లడించారన్నారు. ఎన్సీఆర్బీ నివేదికకు రాష్ట్రం ఇచ్చే రిపోర్టుకు మధ్య తేడా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రం ఇచ్చే నివేదికనే పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రానిది మూడో స్థానమని పత్రికల్లో వచ్చిన సమాచారాన్ని మంత్రి ఖండించారు.