విజయవాడ నగర శివారులో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. అర్ధరాత్రి యువకుడిని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. మృతుడు విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే మహేష్‌గా గుర్తించారు. కాల్పుల ఘటన విజయవాడ శివారు బైపాస్‌రోడ్డులోని బార్ సమీపంలో జరిగింది. పథకం ప్రకారమే మహేష్‌ను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. సీపీ బత్తిన శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని అర్ధరాత్రి పరిశీలించారు.
పోలీసు కమిషనరేట్ ఉద్యోగి మహేష్ హత్యకేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నున్న శివారులోని ఓ దాబా వద్ద మహేష్ తన స్నేహితులు ఐదుగురితో కలిసి మద్యం సేవిస్తుండగా... ఇద్దరు ఆగంతకులు తొమ్మిది రౌండ్లు కాల్పులు జరిపినట్టు పోలీసులు చెబుతున్నారు. మహేష్శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఘటన అనంతరం బాధితుల కారులోనే పారిపోదామనుకున్న నిందితులు కొంత దూరం వెళ్లాక దాన్ని ముస్తాబాద్ రోడ్‌లో వదిలేశారు. ఘటనా స్థలంలో పడి ఉన్న మూడు బుల్లెట్లు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసుశాఖకు చెందిన ఉద్యోగినే హతమార్చడం, స్తబ్దుగా ఉన్న గన్ కల్చర్ మళ్లీ తెరపైకి రావడంతో ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. హత్యకు రియల్ ఎస్టేట్ కారణాలా? లేక కుటుంబ వివాదాలేమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతున్నట్టు సమాచారం. ఘటనాస్థలికి సమీపంలో ఉన్న సీసీ టీటీ దృశ్యాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.