Pawan Kalyan on Amalapuram Incident: కోనసీమ జిల్లా అమలాపురం అల్లర్ల ఘటనపై జనసేన అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమ గొడవలు ఉద్దేశపూర్వకంగా జరిగినవేనని అన్నారు. కోనసీమలో విధ్వంసం జరిగితే.. ముఖ్యమంత్రి, మంత్రులు ఎందుకు వెళ్లలేదని, గొడవలపై నిఘా విభాగానికి సమాచారం ఎందుకు లేదని పవన్ ప్రశ్నించారు. ఓవైపు కోనసీమ తగలబడుతుంటే.. మంత్రులు బస్సు యాత్ర చేస్తారా ? అని నిలదీశారు. అమలాపురం అల్లర్లలో అగ్నిమాపక యంత్రాలు ఎందుకు రాలేదని ప్రభుతాన్ని ప్రశ్నించారు.
కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టాలనే ఆలోచన ఉంటే ముందే చేసేవారని.., జిల్లాల విభజనలో విరుద్ధమైన విధానంలో ప్రభుత్వం ఉందని పవన్ చెప్పారు. గొడవలు జరుగుతాయని ప్రభుత్వానికి ముందే తెలుసునని.., అందుకే ఇప్పటివరకు పాలకులు స్పందించలేదని అన్నారు. సమస్య అంబేడ్కర్ కాదని.., ఒక పార్టీలో 2 వర్గాల మధ్య గొడవ అని చెప్పారు. వైకాపాలో ఉన్న భిన్నాభిప్రాయాల కారణంగానే గొడవలు చోటు చేసుకున్నాయని తెలిపారు.
ఏం జరిగిందంటే :కోనసీమ జిల్లా అమలాపురం గతనెల 24న ఆందోళనలతో అట్టుడికింది. జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ.. కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాదిగా చేరుకున్న నిరసన కారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి.
సెక్షన్ 144, 30 పోలీస్ యాక్టు ఆంక్షలను లెక్కచేయని ఆందోళనకారులు తీవ్ర నిరసన తెలపడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అమలాపురం వీధులు వేల మంది ఆందోళనకారులతో నిండి పరిస్థితి చేయిదాటింది. సామాన్యులు, ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉరుకులు పరుగులు తీశారు. నెలన్నర కిందట జిల్లాల విభజనలో భాగంగా కోనసీమ జిల్లాను ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఇవీ చూడండి
నాకు ఆసక్తి లేదు.. పవన్ ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు: నాగబాబు
దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటా: మోదీ