NH-65: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు వరుసలుగా ఉన్న హైదరాబాద్- విజయవాడ రహదారిని 2007లో అప్పటి ప్రభుత్వం ఆరు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించింది. తొలుత నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయాలని ఆదేశిస్తూ... ఈ బాధ్యతను జీఎంఆర్ సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ పనులు పూర్తి చేసి 2012లో వినియోగంలోకి తెచ్చింది. ఈ రహదారిపై రాజకీయ ఒత్తిళ్లతో పలు ప్రాంతాల్లో నిర్మాణం లోపభూయిష్టంగా సాగింది. తగినన్ని అండర్‌పాసులు, పైవంతెనలు నిర్మించకపోవడంతో తరచూ ప్రాణనష్టం సంభవిస్తోంది. పెద్ద ప్రమాదం జరిగినప్పుడు లేదా స్థానికులు ఆందోళన చేసినప్పుడు అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. శాశ్వత పరిష్కారాల కోసం ప్రయత్నించడం లేదు. పలుమార్లు ఈ రహదారికి సర్వీసు రోడ్లు.. అండర్‌పాసులు నిర్మించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని నల్గొండ, భువనగిరి ఎంపీలు కోరినా ప్రయోజనం లేకపోయింది.
'నిత్యం ప్రమాదాలు పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. చాలా మంది దివ్యాంగులుగా, అనాథలుగా మారుతున్నారు. ప్రస్తుతం అండర్ పాస్‌లు చాలా ముఖ్యం. ఇటీవలే ఒక్కరోజే 13 ప్రమాదాలు సంభవించాయి. వాహనాల సంఖ్య పెరగడం వలన కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. నేషనల్ హైవే వాళ్లు స్పందించి... ఈ ప్రమాదాలను అరికట్టాలని కోరుతున్నాం. డేంజర్ స్పాట్‌లను గుర్తించకపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కనీసం ప్రమాద సూచికలు కూడా లేవు.' -స్థానికులు
చౌటుప్పల్, అంకిరెడ్డిగూడెం చౌరస్తా, పెద్దకాపర్తి, చిట్యాల బస్టాండు, చందంపల్లి క్రాస్‌రోడ్డు వద్ద అండర్‌పాస్‌లు అవసరమున్నా నిర్మించలేదు. దాంతోపాటు కట్టకొమ్ముగూడెం, టేకుమట్ల, జనగాం చౌరస్తా, ముకుందపట్నం, కొమరబండతోపాటు.... కోదాడ బైపాస్, రామాపురం క్రాస్‌రోడ్ వద్ద... అండర్‌పాసుల అవసరమున్నా నిర్మించలేదు. నకిరేకల్ వద్ద రెండు కిలోమీటర్ల మేర భూసేకరణ చేసినా, సర్వీసు రోడ్ నిర్మించలేదు. మునగాల వద్ద సర్వీసు రోడ్ అసంపూర్తిగా ఉండగా... చౌటుప్పల్‌లో గతేడాది చెరువు అలుగు పారడంతో సర్వీసు రోడ్డును పలు ప్రాంతాల్లో తవ్వి వదిలేశారు. రహదారిపై పలుచోట్ల అండర్ పాస్‌లను నిర్మిస్తే ప్రమాదాలు నివారించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.