ప్రభుత్వ భవనాలకు ఇప్పటికే వేసిన వైకాపా రంగులకు అదనంగా ఎర్రమట్టి రంగు వేయాలని ప్రభుత్వం ఏప్రిల్ 23న జీవో నంబర్ 623 జారీ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా అంగలకుదురు రైతు సూర్యదేవర వెంకటరావు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. రాజకీయ పార్టీల జెండాల్ని పోలిన రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వేయడానికి వీల్లేదన్న తీర్పునుప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆక్షేపించారు.
కొత్తరంగులు వేస్తున్నామనే సాకుతో మళ్లీ వైకాపా జెండాను పోలిన రంగుల్నే వేసేలా జీవో తెచ్చిందని విచారణలో పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. జీవోనంబర్ 623లో ప్రభుత్వం నిర్దేశించిన రంగులు హైకోర్టు తీర్పును ఉల్లంఘించేలా ఉన్నాయన్నారు. వైకాపా జెండాను పోలిన ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులను తొలగించకుండా పంచాయతీ భవనాలకు అదనంగా ఎర్రమట్టి రంగును వేయాలని ఉత్తర్వల్లో పేర్కొందని వివరించారు. పార్టీ రంగులేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. 623జీవోను రద్దు చేయాలని కోరారు.