తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతలలోని ఈ దివ్యక్షేత్రంలోకి అడుగుపెట్టగానే అష్టదళ పద్మాకృతిలో ఉండే 45 అడుగుల ఎత్తుతో కూడిన ఫౌంటెయిన్ కనిపిస్తుంది. పద్మ పత్రాలు విచ్చుకునేలా దాదాపు రూ.25 కోట్లతో ఫౌంటెయిన్ నిర్మించారు. పద్మపత్రాల మధ్య నుంచి నీళ్లు, రామానుజులను అభిషేకిస్తున్న భావన భక్తులకు కలిగించేలా ఫౌంటెయిన్ ఏర్పాటు చేశారు. అదే సమయంలో రామనుజుల కీర్తనలు శ్రావ్యంగా వినిపించేలా నిర్మాణం చేశారు. సూర్యాస్తమయం తరువాత రామానుజులు ప్రబోధించిన సమానత్వ ఘట్టాలు మ్యూజిక్‌తో త్రీడీ షో ద్వారా ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
పూలవనాలతో ముస్తాబైన క్షేత్రం..
ఈ మహోన్నత క్షేత్రాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి సుమారు 1,200 మంది శిల్పులు, ఇతర చేతివృత్తి కళాకారులు నిరంతరం పనిచేస్తున్నారు. ఈ ఆవరణలో రాజస్థాన్‌లో లభించే పింక్ గ్రానైట్‌తో తయారు చేసిన పలు ఆకృతులు ఆకట్టుకుంటున్నాయి. రామానుజుల జీవిత విశేషాలు ప్రతిబింబించేలా మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. దివ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఉద్యానవనాలు ఆకట్టుకుంటున్నాయి. విభిన్న రంగులతో కూడిన లక్షలాది మొక్కలు ఉద్యానవనాల్లో ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి, ప్రధాని రాక నేపథ్యంలో ముచ్చింతల చుట్టు పక్కల రహదారులను పూల మొక్కలతో అందంగా తీర్చిదిద్దుతున్నారు.
9 అంకెతో ప్రత్యేక అనుబంధం..
ఈ క్షేత్రంలో.. తొమ్మిది అంకెతో చమత్కారం ప్రతి నిర్మాణంలో కన్పిస్తుంది. 9 అంకెను అవికారి అని భావిస్తారు. సమతామూర్తి విగ్రహాన్ని వివిధ కోణాల్లో చూస్తే.. దిగువన భద్రవేదిక 54 అడుగులు, లోటస్ 27 అడుగులు ఉంటుంది. పద్మపీఠం త్రిదళాలు 3 వరసల్లో నిర్మాణం చేశారు. ఒక వరసకు 36 చొప్పున మొత్తం 108 ఉంటాయి. చుట్టూ ఏనుగు విగ్రహాలు 9 ఏర్పాటు చేశారు. రామానుజం వారి ఒక కన్ను 4.5 అడుగులు ఉంటుంది. 2 కన్నులు కలిపి 9 అడుగులు ఉంటాయి. వాటర్ ఫౌంటెన్ 36 అడుగులు, పైకి ఎక్కే మెట్లు తొమ్మిదింటిని ఏర్పాటు చేశారు. శ్రీరామానుజాచార్యుల విగ్రహం 108 అడుగులు, స్వామి చేతిలోని త్రిదండం 27 అడుగుల ఎత్తు ఉన్నాయి. దివ్య దేశాలుగా భావించే 108 పుణ్య క్షేత్రాలు ఏర్పాటు చేశారు. అన్నీ కలిపితే 9 సంఖ్య వస్తుంది. 144 యాగశాలలు అవి కూడా తొమ్మిదే. 1,035 హోమగుండాలు ఏర్పాటు చేశారు. అవి కూడా మొత్తం కలిపితే 9 అవుతుంది.
120 కిలోల బంగారు విగ్రహంగా..
ప్రపంచవ్యాప్తంగా కూర్చున్న భంగిమలో ఉన్న అత్యంత ఎత్తయిన విగ్రహాల్లో ఈ సమతా మూర్తి విగ్రహం రెండోది కావడం విశేషం. సమతామూర్తి విగ్రహంలో పద్మపీఠంపై పంచలోహాలతో తయారు చేసిన 36 శంఖు, చక్రాలతో పాటు ఏనుగు ఆకృతులు అమర్చారు. గర్భగుడిలో స్తంభాల పై చెక్కిన ఆకృతులు అలరిస్తున్నాయి. మహా విగ్రహం కింద విశాలంగా ఉన్న గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహ రూపంలో రామానుజులు నిత్యపూజామూర్తిగా కనిపిస్తారు. ఈ విగ్రహం చుట్టూ సప్తవర్ణ కాంతులు ప్రసరించే విధంగా ఏర్పాట్లు చేశారు.
నిత్యం కోటిసార్లు అష్టాక్షరీ మంత్రం..