Telangana Governor Delhi Tour: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అత్యవసరంగా దిల్లీ పర్యటనకు వెళ్లారు. నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ కానున్నారు. హోంశాఖ పిలుపు మేరకే గవర్నర్ దిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో గవర్నర్ పర్యటన చర్చనీయాంశమైంది. షెడ్యూల్ ప్రకారం తమిళిసై సోమవారం రాత్రి దిల్లీకి బయలుదేరాల్సి ఉండగా పర్యటన రద్దయింది.
కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఉదంతం మొదలు మండలి ప్రొటెం ఛైర్మన్ నియామకం సహా ఇతరత్రా పరిణామాల నేపథ్యంలో రాజ్ భవన్, ప్రగతిభవన్ మధ్య అంతరం బాగా పెరిగింది. రాజ్భవన్లో జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి సహా మంత్రులు హాజరు కాలేదు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా తన ప్రసంగం లేకపోవడంపై గవర్నర్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్ భవన్లో జరిగిన ముందస్తు వేడుకలకు సీఎం, మంత్రులతో పాటు తెరాస నేతలు, ఉన్నతాధికారులు హాజరు కాకపోవడం పలు చర్చలకు దారితీసింది.