ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్‌.. ఘటనలపై ప్రభుత్వం సీరియస్​ - ఏపీలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ

government serious on ssc paper leakage
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్‌ ఘటనలపై ప్రభుత్వం ఆగ్రహం

By

Published : May 2, 2022, 9:06 PM IST

Updated : May 3, 2022, 5:48 AM IST

21:03 May 02

SSC Papers Leakage in AP: ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం

పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్‌.. ఘటనలపై ప్రభుత్వం సీరియస్​

పదో తరగతి పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌, ప్రశ్నాపత్రాల లీకేజీలను యంత్రాంగం అరికట్టలేకపోతోంది. కట్టడి చర్యలు తీసుకున్నామని మంత్రి, అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. కాపీయింగ్‌, లీక్‌ల పరంపర కొనసాగుతుండగా.. పరీక్షల నిర్వహణే అపహాస్యంగా మారింది. దీంతో ఈ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.

ఏప్రిల్‌ 27న ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్లో తెలుగు పేపర్‌ నుంచి నిన్నటి గణితం వరకు ప్రశ్నపత్రాలు ముందుగానే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ముందుగానే బయటకొచ్చిన ప్రశ్నపత్రాల ఆధారంగా చిట్టీలతో సమాధానాలు పరీక్ష కేంద్రాలకు చేరవేస్తున్నారు. మాస్‌ కాపీయింగ్‌ పెరిగిపోతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రతిభకు ప్రాధాన్యం లేకుండా పోతోందని మనోవ్యధకు గురవుతున్నారు.

సోమవారం జరిగిన గణితం పరీక్షల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా భారీగా మాస్‌కాపీయింగ్ కొనసాగింది. ఏలూరు విద్యావికాస్ పాఠశాల పరీక్ష కేంద్రంలో మాస్ కాపీయింగ్ ఘటన కలకలం రేపింది. కార్బన్‌ కాపీ సాయంతో సమాధానాలు తయారుచేస్తున్న ముగ్గురు అధికారులను పోలీసులు పట్టుకున్నారు. వీరిని జిల్లా విద్యాశాఖాధికారి గంగాభవాని.. సస్పెండ్ చేశారు. ఏలూరు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో వీరిపై కేసు నమోదయింది. వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఏలూరు జిల్లా కైకలూరు మండవల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి పరీక్ష కేంద్రంలోనూ గణితం పరీక్ష ప్రశ్నపత్రం లీకయింది. ఉత్తీర్ణత శాతం పెంచడానికి కొందరు ఉపాధ్యాయులు ఈ పనికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్‌ ఫిర్యాదు మేరకు 9 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

ప్రశ్నపత్రాల లీకేజీ కృష్ణా జిల్లాలోనూ సంచలనంగా మారింది. గత ఎనిమిదేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తున్న పసమర్రు జెడ్పీ ఉన్నత పాఠశాల దీనికి వేదికగా మారడం మరింత కలకలం రేపుతోంది. ఈ పాఠశాల విద్యార్థులు గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో పరీక్షలు రాస్తున్నారు. పసమర్రు పాఠశాలకు చెందిన కొందరు ఉఫాధ్యాయులు.. ప్రశ్నపత్రాలకు సమాధానాలను పలు ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నట్లు విద్యా శాఖకు సమాచారం అందింది. పసమర్రు పాఠశాలలో తనిఖీలు జరిపిన అధికారులు.. అక్కడి ఉఫాధ్యాయులు, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు. ఏడుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. వీరికి ప్రశ్నపత్రాలు.. ఏలూరు జిల్లా మండవల్లి నుంచి వస్తున్నట్లు అనుమానిస్తున్నారు

కర్నూలు జిల్లా ఆలూరులో ఓ వ్యక్తి పరీక్ష రాస్తున్న విద్యార్థికి కాపీ చీటీలు అందించడానికి వెళ్లగా.. గస్తీ కాస్తున్న ఎస్సై దాడి చేసి పట్టుకున్నారు. ఆ యువకుడి సెల్‌ఫోన్‌లో ప్రశ్నపత్రం ప్రత్యక్షం కాగా విషయాన్ని జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి దృష్టికి ఎస్సై తీసుకెళ్లారు. ఎస్పీ స్వయంగా ఆలూరుకు వచ్చి విచారణ చేపట్టారు. ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురంలోని రెండు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన విద్యాశాఖ అధికారి పార్వతి.. పలు గదుల్లో కాపీ చిట్టీలు ఉండటంతో విషయాన్ని డీఈవోకు వివరించారు. డీఈవో 16 మంది ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించి వారి స్థానాల్లో కొత్తవారిని ఏర్పాటు చేశారు.

పదో తరగతి పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటి వరకు 42 మంది టీచర్లును అరెస్టు చేయగా... వారందరినీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే నంద్యాల జిల్లా నందికొట్కూరులో గత నెల 19న ఆంగ్లం పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి కారకులైన ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు పంపారు. అరెస్టు అయిన ఉపాధ్యాయులు.. ఉద్దేశపూర్వకంగానే మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పిడినట్లు రుజువైతే సర్వీస్ నుంచి తొలగించాలని విద్యాశాఖ యోచిస్తోంది.

ఇదీ చదవండి: ఆ ప్రచారాన్ని నమ్మెద్దు.. పకడ్బందీగా పది పరీక్షల నిర్వహణ: మంత్రి బొత్స

Last Updated : May 3, 2022, 5:48 AM IST

ABOUT THE AUTHOR

...view details