ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TAXES : ఎప్పుడో స్థలాలు కొన్నవారికి... ఇప్పుడు పన్నుపోటు! - ఏపీలో పన్నుల వార్తలు

పట్టణాల్లో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పేరుతో రుసుములు చెల్లించాలని పేదలకు ఇప్పటికే తాఖీదులిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. లేఅవుట్లలో ఎప్పుడో స్థలాలు కొన్నవారికి వ్యవసాయేతర భూమి పన్ను కట్టాలని ప్రస్తుతం నోటీసులిస్తోంది. పన్ను చెల్లించని ప్లాట్ల క్రయవిక్రయాలపై రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సబ్‌ రిజిస్ట్రార్లను ప్రభుత్వం ఆదేశించడం మరింత కలవరపెడుతోంది.

TAXES
TAXES

By

Published : Apr 16, 2022, 4:04 AM IST

పట్టణాల్లో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పేరుతో రుసుములు చెల్లించాలని పేదలకు ఇప్పటికే తాఖీదులిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. లేఅవుట్లలో ఎప్పుడో స్థలాలు (ప్లాట్లు) కొన్నవారికి వ్యవసాయేతర భూమి (నాలా) పన్ను కట్టాలని ప్రస్తుతం నోటీసులిస్తోంది. అప్పులు చేసి ప్లాట్లు కొన్న కుటుంబాలు లక్షలాది రూపాయిలు చెల్లించాలంటే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లేఅవుట్లకు అనుమతులిచ్చినప్పుడే వ్యాపారులు (డెవలపర్లు) నాలా పన్ను చెల్లించారా? లేదా? పరిశీలించకుండా, అనేక ఏళ్ల తర్వాత కొనుగోలుదారులను బాధ్యులను చేయడంపై ఆవేదన చెందుతున్నారు. పన్ను చెల్లించని ప్లాట్ల క్రయవిక్రయాలపై రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సబ్‌ రిజిస్ట్రార్లను ప్రభుత్వం ఆదేశించడం మరింత కలవరపెడుతోంది. విజయవాడలో వందకుపైగా లేఅవుట్ల నుంచి నాలా పన్ను వసూలు చేయడానికి రెవెన్యూ శాఖ సిద్ధమైంది. మిగతా నగరాల్లోనూ ఇదే విధంగా నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో రూ.500 కోట్లకుపైగా పన్ను వసూలు చేయాలన్నది లక్ష్యంగా తెలుస్తోంది.

అప్పుడు ఏమయ్యారు?

పట్టణాభివృద్ధి సంస్థలు ప్రైవేట్‌ లేఅవుట్లకు ప్లాన్లు (ఎల్‌పీ నంబరు) ఇచ్చాయంటే వీటిలో ఎలాంటి లొసుగులు ఉండవన్న నమ్మకంతో ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేస్తుంటారు. అన్ని రకాల ఫీజులు చెల్లించాకే పట్టణాభివృద్ధి సంస్థలు అనుమతులిస్తాయన్నది భరోసా. అనుమతులిచ్చేటప్పుడే సంబంధిత వ్యాపారి రెవెన్యూ శాఖకు నాలా పన్ను చెల్లించారా, లేదా అన్నది పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు మొదట పరిశీలిస్తారు.

ఆ తర్వాత డెవలప్‌మెంట్‌ ఛార్జీలు, భూ వినియోగ మార్పిడి రుసుములు వసూలు చేస్తారు. 2006 తరువాత వేసిన ప్రతి లేఅవుట్‌కు నాలాపన్ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అయినప్పటికీ 2007, 2008, 2009లో వేసిన లేఅవుట్లల్లో కొనుగోలు చేసిన ప్లాట్లకు నాలాపన్ను చెల్లించాలని తాజాగా రెవెన్యూ శాఖ నోటీసులిస్తోంది. అంటే నాలాపన్ను చెల్లించకపోయినా పట్టణాభివృద్ధి సంస్థలు లేఅవుట్లకు అనుమతులిచ్చాయా?, ఇచ్చినా రెవెన్యూ శాఖ ఇప్పటిదాకా పట్టించుకోలేదా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రాథమిక దశలోనే లోపాలు గుర్తించి నోటీసులిస్తే లేఅవుట్‌ వేసిన వ్యాపారి పన్ను చెల్లించేవారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం వంటి నగరాల్లో లేఅవుట్లు వేసిన వ్యాపారులు ఇప్పుడెక్కడున్నారో తెలియదు. పేరొందిన స్థిరాస్తి వ్యాపార సంస్థలైతే సులువుగా గుర్తించవచ్చు. చిన్నాచితక సంస్థలు, వ్యాపారుల చిరునామా తెలుసుకొని, వారిని ప్రశ్నించడం సాధ్యమయ్యే పని కాదు.

5% పన్ను.. మరో 5% అపరాధ రుసుము: ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్దేశించిన విలువపై 5% చొప్పున నాలా పన్ను, మరో 5% అపరాధ రుసుము చెల్లించాలంటే కొనుగోలుదారులకు తడిసిమోపెడవుతుంది. విజయవాడ నగర శివారులో ఒక వ్యక్తి 2007లో గజం రూ.15 వేల ధరకు 200 గజాల విస్తీర్ణం గల ప్లాట్‌ని రూ.30 లక్షలకు కొన్నారు. అదే గజం స్థలం ధర ప్రస్తుతం రూ.30 వేలు ఉంది. అంటే ప్లాట్‌ విలువ రూ.60 లక్షలు. దీనిపై 5% నాలా పన్ను రూ.3 లక్షలు, 5% అపరాధ రుసుము కింద మరో రూ.3 లక్షలు కలిపి మొత్తం రూ.6 లక్షలు కట్టాలి. సీఆర్‌డీఏ, వుడా, తుడా వంటి పట్టణాభివృద్ధి సంస్థల్లో స్థలాల విలువ ఎక్కువ అయినందున ఇప్పుడు వారు భారీగా చెల్లించాల్సి ఉంటుంది. లేఅవుట్లలో ప్లాట్లు కొన్నవారిలో 60% వరకు మధ్య తరగతి కుటుంబాలు ఉంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేసే వారు బ్యాంకుల్లో అప్పులు చేసి కొనుగోలు చేస్తుంటారు. ప్లాట్‌ కొన్నందుకు చేసిన అప్పులు తీరకముందే.. నాలాపన్ను ఏంటని విజయవాడకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి ఒకరు వాపోయారు.

4నగరాల్లో 450 లేఅవుట్లు రూ. 500 కోట్లు :విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాల్లో నాలా పన్ను చెల్లించని దాదాపు 450 లేఅవుట్లను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అత్యధికంగా విశాఖలో 150 లేఅవుట్లు ఉన్నాయి. శాటిలైట్‌ ఇమేజ్‌ల ద్వారా వీటిని గుర్తించి నోటీసులు సిద్ధం చేస్తున్నారు. విజయవాడలో ఇప్పటికే కొన్ని నోటీసులు జారీ చేశారు. మిగతా నగరాల్లోనూ త్వరలో ఇవ్వనున్నారు. నాలుగు నగరాల్లో రూ.500 కోట్లకుపైగా పన్ను వసూలు చేయాలన్నది ప్రణాళికగా తెలుస్తోంది.

ఇదీ చదవండి:NRITDP website: ఎన్​ఆర్​ఐటీడీపీ వెబ్​సైట్​ను ప్రారంభించిన చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details