కరోనా మహమ్మారి తొలి, మలి దఫా తాకిడిలో పెను విలయం సృష్టించిన నేపథ్యంలో.. మూడో దశ విజృంభనను సమర్థంగా ఎదుర్కొనేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. ‘థర్డ్ వేవ్’ ముప్పు ఉందన్న నిపుణుల హెచ్చరికలు, ఈసారి పిల్లలపైనే ఎక్కువగా ప్రభావం చూపుతుందన్న అంచనాల నడుమ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తదనుగుణంగా వసతులు సమకూర్చుకుంటోంది. కొవిడ్ రెండో ఉద్ధృతిలో రాష్ట్రవ్యాప్తంగా 620 ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించారు.
ఓ దశలో రోజుకు 45వేల వరకు పడకలు బాధితులతో నిండాయి. ఈ అనుభవంతో అదనంగా మరో 150 ఆసుపత్రులతో పాటు 15 వేల పడకలను అందుబాటులోకి తెస్తున్నారు. ఐసీయూ పడకలను 5 వేల నుంచి 10 వేలకు పెంచుతున్నారు. ఆక్సిజన్ పడకల్లో కొన్నింటిని చిన్నపిల్లలకు ప్రత్యేకంగా కేటాయించనున్నారు. 50 పడకల సామాజిక ఆసుపత్రుల్లోనూ కొన్నింటిని కొవిడ్ చికిత్సకు సిద్ధం చేస్తున్నారు. చిన్నపిల్లలకు మాత్రమే ఉపయోగించే వెంటిలేటర్లు సమకూర్చుకుంటున్నారు. కొత్తగా 23 వేల వరకు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని ఆసుపత్రులకు పంపుతున్నారు. ఇప్పటికే 17 వేల డి-టైప్ సిలిండర్లు ఆసుపత్రులకు చేరాయి.
139 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు
ప్రస్తుతానికి గుర్తించిన 480 ప్రైవేట్ ఆసుపత్రుల్లో తొలి దశలో 139 ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పుతున్నారు. బోధన, జిల్లా, వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రుల్లో 50 పడకలకు మించి ఉన్న చోట ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు.