రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు దీటుగా ఎదుర్కొని.. రాజ్యాధికారం సాధించాలనేది బీసీ సంక్షేమ సంఘం లక్ష్యమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు వ్యాఖ్యనించారు. విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన...స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్నా బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారన్నారు. రాష్ట్రంలో బీసీలు 52 శాతం ఉన్నా...కేవలం ఓటు యంత్రాలుగానే పార్టీలు వినియోగించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ, చట్టసభల్లో పదవుల కేటాయింపులో తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. బీసీ కులాలందరిని ఒకే తాటిపైకి తీసుకువచ్చి రాజకీయంగా ఎదగాలనే లక్ష్యంలో భాగంగా సంఘాన్ని బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మేదోమథన సదస్సులు, అనుబంధ సంఘాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల్లో చట్టబద్ధతతో కూడిన 84 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడుగా మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్, పొలిటికల్ జేఏసీ ఛైర్మన్గా పాలచూరి రాంబాబును నియమిస్తూ నియామక పత్రాలను జారీ చేశారు.