విజయవాడ 1వ పట్టణ పరిధిలో నివసించే వసంతరావు ఆరోగ్యం సరిగా లేకపోవటంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది కరోనా లక్షణాలున్నాయనే అనుమానంతో జూన్ 24న కొవిడ్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కుటుంబ సభ్యులు అలాగే కొవిడ్ ఆస్పత్రికి వెళ్లారు. అదే రోజు వృద్ధుడికి చికిత్స చేసేందుకు కోవిడ్ ఆసుపత్రి సిబ్బంది లోపలికి తీసుకువెళ్లారు. వృద్ధుడి భార్య ధనలక్ష్మి ఆ రోజు సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. వైద్యం కోసం వృద్ధుడి ఆధార్ కార్డ్ తీసుకుని రమ్మని వైద్య సిబ్బంది చెప్పడంతో ఆమె ఆరాత్రి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం ఆధార్ కార్డు తీసుకెళ్లి అడిగేసరికి .. వసంతరావు ఎక్కడున్నాడో తమకు తెలియదని సిబ్బంది చెప్పారు. అప్పటి నుంచి ఆమె వృద్ధుడి ఆచూకీ కోసం ఆసుపత్రి చుట్టూ తిరుగుతూనే ఉన్నా.. సమాధానం ఇచ్చేవారే కరవయ్యారు.
చివరకు ఆమె తన భర్త వసంతరావు ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించారు. అదృశ్యం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆసుపత్రి సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. అందులో వసంతరావును వీల్ ఛైర్ లో తీసుకెళ్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. అయినా ఆసుపత్రి సిబ్బంది పాతపాటే పాడారు. ఆ వృద్ధురాలి ఆవేదనపై మీడియాలో ప్రముఖంగా కథనాలు వచ్చాయి.