రాష్ట్రవ్యాప్తంగా 47 బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్లకు 481 మంది డైరెక్టర్ల జాబితాను మంత్రులు సుచరిత, చెల్లుబోయిన వేణుగోపాల్‌తో కలిసి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు. రాజకీయంగా వెనకబడిన వర్గాలకు ఉన్నతస్థాయి కల్పించేందుకు వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. కొన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు అభ్యర్ధులను వెతికి మరీ కార్పొరేషన్ పదవులు ఇచ్చామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సామాజికంగా, ఆర్థికంగా ఉన్నతస్థాయికి తీసుకురావాలనే లక్ష్యంతో కేబినెట్ పదవులల్లోనూ ప్రాధాన్యత కల్పించామన్నారు. శాసన మండలి ఛైర్మన్ పదవిని సైతం వెనుకబడిన వర్గాల వారికే ఇస్తామని సజ్జల ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ బీసీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే వాడుకుంటోందని సజ్జల ఆరోపించారు. బీసీలు అంటే లెక్కలేదన్నట్లు ఆ పార్టీ వ్యవహరిస్తోందని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరించి సామాజిక న్యాయం పాటిస్తోందని స్పష్టం చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీలోనూ వెనుకబడిన వర్గాలకు 80 శాతం మేర పంపిణీ చేశామన్నారు. మొక్కుబడిగా ఏ పనీ చేయలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ల డైరెక్టర్ల నియామకం ఊసే లేదని ఆరోపించారు. అన్ని వర్గాలకూ మేలు చేసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రులు సుచరిత, చెల్లుబోయిన వేణుగోపాల్ తెలిపారు.