ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్) నుంచి నకిలీ చెక్కులతో రూ.117 కోట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నించిన ముఠా మూలాలు ఏపీ సహా మొత్తం ఆరు రాష్ట్రాల్లో విస్తరించినట్లు అవినీతి నిరోధక శాఖ (అనిశా) గుర్తించింది. ఈ దందాలో బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, దిల్లీ రాష్ట్రాల వ్యక్తులు కీలకంగా వ్యవహరించినట్లు తేల్చింది. వీరందర్నీ నడిపించిన ‘బాస్’ ఎవరనే కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏపీ సీఎంఆర్‌ఎఫ్ కార్యాలయం జారీ చేసే చెక్కుల వివరాలు ఎక్కడో పశ్చిమబెంగాల్, దిల్లీలలో ఉండే వారికి ఎలా చేరాయి? ఈ ముఠా నాయకుడి మూలాలు ఏపీలోనే ఉన్నాయా? అతను రాజకీయ నాయకుడా? ప్రభుత్వాధికారా? అనే కోణంలోనూ విచారిస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పుర్, కర్ణాటకలోని మంగళూరు ప్రాంతాల్లో ఇప్పటికే తొమ్మిది మందిని అనిశా అదుపులోకి తీసుకుంది. దిల్లీలో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నకిలీ చెక్కులను ఎక్కడ తయారు చేస్తున్నారు? ఇలా ఇప్పటివరకు ఎంత మొత్తాన్ని నగదుగా మార్చుకున్నారనే అంశాలపై ఆరా తీస్తున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాలు, ఇతర నగదు లావాదేవీలనూ పరిశీలిస్తున్నారు. వాటి నుంచి ఏపీకి చెందిన వ్యక్తుల ఖాతాల్లోకి ఏమైనా డబ్బుల బదలాయింపు జరిగిందా? అనే అంశాలపైనా దృష్టిసారించారు.
కీలక దశకు సీఎంఆర్‌ఎఫ్ కుంభకోణం కేసు - ఏపీ సీఎంఆర్‌ఎఫ్ కుంభకోణం కేసు
ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధి నుంచి నకిలీ చెక్కులతో కోట్లు కొల్లగొట్టేందుకు యత్నించిన ముఠా మూలాలు ఆరు రాష్ట్రాల్లో విస్తరించినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే 9మందిని అరెస్టు చేసిన అధికారులు..వీరందరినీ నడిపించిన నాయకుడు ఎవరనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
బ్యాంకులకు వెళ్లి... చిక్కిన వైనం
-
నకిలీ చెక్కులతో మల్లబపూర్ పీపుల్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ పేరిట రూ.24.65 కోట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నించిన ఉదంతంలో బిహార్‌లోని మీర్జాగంజ్‌కు చెందిన ఆమోద్, పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన అశోక్‌కుమార్ బసు, జార్ఖండ్‌లోని జంషెడ్‌పుర్‌కు చెందిన అజయ్‌కుమార్‌ను ఇటీవల ఖరగ్‌పుర్‌లో అదుపులోకి తీసుకున్నారు. -
అద్వైత వీకే హోలో బ్లాక్స్ అండ్ ఇంటర్‌లాక్ సంస్థ పేరిట కర్ణాటక రాష్ట్రం మంగళూరు సమీపంలోని మూడబిదరిలోని ఎస్‌బీఐ శాఖ నుంచి ఫోర్జరీ చెక్కులతో రూ.52.65 కోట్లను కాజేసేందుకు యత్నించినందుకు యోగీష్ ఆచార్య, ఉదయ్ శెట్టి కంతవర్, బ్రిజేష్ రై, గంగాధర్ సువర్ణ తదితరులనూ అరెస్టు చేశారు. -
శర్మ ఫోర్సింగ్ పేరిట దిల్లీలో రూ.39.85 కోట్లు కాజేసేందుకు యత్నించిన వారి కోసం వెతుకుతున్నారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వీరందరికీ ముందే పరిచయం ఉందా? ఉంటే ఎక్కడ కలిశారనే అంశాలపైనా అనిశా వివరాలు సేకరిస్తోంది.
ముఠాకు వివరాలు ఎలా చేరాయి?
సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు తొలుత స్థానిక ఎమ్మెల్యేల కార్యాలయాలకు నేరుగా చేరుతాయి. వాటిని లబ్ధిదారులకు ఎమ్మెల్యేలు పంపిణీ చేస్తుంటారు. ఇలాంటి చెక్కులపై ఉండే నంబర్లు, ముద్రలు, సంతకాలు నకిలీ ముఠా సభ్యులకు చేరడానికి సీఎంఆర్‌ఎఫ్ కార్యాలయంలోని వారైనా సహకరించాలి. లేదా ప్రజాప్రతినిధుల వద్ద పనిచేసే సహాయకులు, ఇతర వ్యక్తుల నుంచైనా అందుండాలి. లబ్ధిదారులు, వారి పరిచయస్తుల ద్వారానైనా చేరుండాలి. ఈ మూడింట్లో ఏదో ఒక అవకాశం ఉంటుందని అనిశా అధికారులు అనుమాస్తూ విచారణ చేస్తున్నారు. అన్నీ వెల్లడైతే ముఠా నాయకుడి గట్టురట్టవుతుంది.