ఉద్యోగం రాలేదన్న బాధతో నిరుద్యోగులు చేసుకున్న ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు ధ్వజమెత్తారు. ఈ చావులకు ముఖ్యమంత్రి జగనే కారకులని విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండిపడ్డారు.
" సీఎం జాబ్ క్యాలెెండర్తో నిరుద్యోగుల్లో నిరాశ పెరిగి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పదిరోజుల వ్యవధిలో కర్నూలు జిల్లాలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్, జిల్లా మంత్రులు సైతం ఈ ఆత్మహత్యలపై కనీసం స్పందించలేదు. ఈ చావులకు ముఖ్యమంత్రే కారకులు. చనిపోయిన ప్రతి నిరుద్యోగి కుటుంబానికి రూ.25లక్షల ఆర్థిక సాయం, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించాలి. ఇచ్చిన హామీ ప్రకారం 2.30లక్షల ఉద్యోగాలతో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు మా పోరాటం కొనసాగుతుంది' అని శ్రీరామ్ చినబాబు హెచ్చరించారు.