ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Sri lankan Crisis : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. తెలుగు రాష్ట్రాల నుంచి బియ్యం

sri lankan crisis : ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక ప్రజలు నిత్యావసరాల కోసం అల్లాడుతున్నారు. వీరిని ఆదుకునేందుకు ముందుకొచ్చిన భారత్ అవసరమైన మేరకు సాయమందిస్తోంది. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలు శ్రీలంక ప్రజలకు బియ్యం పంపించనున్నాయి.

Telugu rice to Sri Lanka
శ్రీలంకకు తెలుగు రాష్ట్రాల బియ్యం

By

Published : Apr 6, 2022, 9:26 AM IST

sri lankan crisis : ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని ఆహార ధాన్యాల కొరతతో అల్లాడుతున్న శ్రీలంకను ఆదుకొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి బియ్యం వెళ్లనున్నాయి. శ్రీలంక అభ్యర్థన మేరకు అవసరమైన సాయం చేసేందుకు ముందుకొచ్చిన భారత్‌.. తక్షణం బియ్యం పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం కూడా జరిగింది.

sri lankan crisis News : ఇందులో భాగంగా కాకినాడ, విశాఖపట్నం, చెన్నై, ట్యుటికోరిన్‌ తదితర పోర్టుల నుంచి బియ్యం శ్రీలంకకు ఎగుమతి చేయనున్నారు. మొదటగా కాకినాడ పోర్టు నుంచి బుధవారం రెండు వేల మెట్రిక్‌ టన్నులతో కార్గో బయలుదేరనుంది. తర్వాత చెన్నై, విశాఖపట్నం పోర్టుల నుంచి పంపించనున్నారు. తెలంగాణలో కొనుగోలు చేసే బియ్యాన్ని చెన్నై పోర్టు ద్వారా తరలించనున్నారు. మొత్తం మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని దశలవారీగా శ్రీలంకకు పంపుతామని భారత బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు బి.వి.కృష్ణారావు తెలిపారు.

మంత్రుల రాజీనామా : తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో 26 మంది కేబినెట్ మంత్రులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం శ్రీలంక ప్రధానికి రాజీనామా పత్రాలు అందజేశారు. రాజీనామాల నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వారు పేర్కొన్నారు. అయితే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సోదరుడు మహిందా రాజపక్స ప్రధానిగా కొనసాగనున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎమర్జెన్సీ ఎత్తివేత :ఇటీవల పెరిగిన ధరలు, నిత్యవసరాల కొరత, విద్యుత్‌ కోతలతో ప్రజలు గత కొన్నిరోజులుగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో అధ్యక్ష స్థానం నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తూ అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. దీంతో తీవ్ర హింస చెలరేగింది. పలువురు గాయపడ్డారు. దీంతో అధ్యక్షుడు ఎమర్జెన్సీ విధించారు. ఈ నిర్ణయాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు మంగళవారం రాత్రి ప్రకటించారు.

రూ.200కి చేరిన బియ్యం ధర: శ్రీలంక సంక్షోభం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. నిత్యావసరాల ధరలు, పండ్లు, కూరగాయలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం పార్లమెంట్ సమీపంలో భారీగా ఆందోళన చేపట్టారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. "ద్రవ్యోల్బణం పెరుగుతోంది. నిత్యావసరాల ధరలు 100శాతానికి పైగా పెరిగాయి. గొటబాయ రాజపక్స అధికారం చేపట్టినప్పుడు కిలో బియ్యం 80 రూపాయలు. ప్రస్తుతం రూ.200 కంటే ఎక్కువ రేటు ఉంది. ప్రస్తుతం రోజుకు 13-14 గంటల కరెంటు కోతలు ఉన్నాయి. పరీక్షలు రాయడానికి కనీసం పేపరు కూడా లేదు. శ్రీలంకలోని ఆహార పదార్థాలను ప్రభుత్వం చైనాకు అమ్మేసింది. దేశంలో ప్రస్తుతం ఏమీ లేదని.. ఇతర దేశాల నుంచి అప్పుపై తెచ్చుకోవడమే" అని మహిళా నిరసనకారురాలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

యాపిల్​ కిలో రూ.వెయ్యి: "ఆర్థిక, రాజకీయ సంక్షోభాల మధ్య శ్రీలంకలో పండ్లు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 4 నెలల క్రితం యాపిల్ కిలో రూ. 500.. ఇప్పుడు కిలో రూ. 1000" అని హోటల్ అసోసియేషన్ సభ్యులు నిరసన తెలిపారు. 'ఈస్టర్ బాంబు దాడుల తర్వాత పర్యాటకంపై ప్రభావం పడింది. కొవిడ్​తో పూర్తిగా దెబ్బతింది. పర్యాటకులు దేశంలోకి తిరిగి రావాలి. మాకు ఏ పార్టీలతోనూ, ఏ రాజకీయ నాయకులతో ఎటువంటి సమస్యలు లేవు.. పర్యాటకులు శ్రీలంకను సందర్శించాలి' శ్రీలంక చెఫ్స్ గిల్డ్ ఛైర్మన్ గెరార్డ్ మెండిస్ చెప్పారు. ఆహారం, ఇంధన కొరతతో శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతోంది. కొవిడ్ మహమ్మారి విజృంభణతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనానికి దారితీసింది. విదేశీ మారకద్రవ్య కొరతను ఆ దేశం ఎదుర్కొంటోంది. విదేశీ మారకనిల్వలను లేకపోవడం వల్ల ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోయింది. ఇది దేశంలో విద్యుత్ కోతలకు దారితీసింది. నిత్యావసర వస్తువులను శ్రీలంక తన మిత్రదేశాల నుంచి సహాయం కోరాల్సి వస్తోంది.

ఇదీ చదవండి :

'ఆర్థికంగా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాం.. ఆదుకోండి'.. ప్రధాని మోదీకి జగన్‌ వినతి

ABOUT THE AUTHOR

...view details