Shilpa Chowdary Cheating Case :పెట్టుబడుల పేరుతో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడిన మహిళ.. శిల్పా చౌదరిపై హైదరాబాద్లోని నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో మరో ఫిర్యాదు నమోదైంది. నటుడు హర్ష.. శిల్పపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెహరి సినిమాలో హీరోగా హర్ష నటించారు. శిల్ప తన దగ్గర రూ.3 కోట్లు తీసుకొని తిరిగి చెల్లించలేదని హర్ష పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెహరి చిత్రాన్ని శిల్ప నిర్మించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికేనార్సింగి పోలీసులు ఆమెను రెండు రోజుల కస్టడీకితీసుకున్నారు.
Shilpa Chowdary: కోర్టు అనుమతితో శిల్పను విచారించనున్నారు. శిల్ప ఎవరెవరి వద్ద నుంచి ఎంత సొమ్ము తీసుకుందనే వివరాలు రాబట్టనున్నారు. డబ్బులు ఎక్కడకు మళ్లించారు. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలపైనా పోలీసులు లోతుగా ఆరా తీయనున్నారు. శిల్పా చౌదరిపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేయగా.. 7 కోట్ల 5లక్షలు తీసుకుందని పోలీసులు గుర్తించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లలోనూ కేసులు నమోదయ్యాయి. కిట్టీ పార్టీల పేరుతో మహిళలను ఆకట్టుకున్న శిల్పాచౌదరి.. స్థిరాస్తి వ్యాపారం కోసమంటూ డబ్బు తీసుకుందని పోలీసులు గుర్తించారు. భారీగా లాభాలిస్తానని నమ్మించి మోసం చేసిందని ఫిర్యాదులు అందాయి. 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఉప్పర్‌పల్లి కోర్టును పోలీసులు కోరగా.. రెండు రోజులు విచారణ చేసేందుకు అనుమతిచ్చింది.