ఆంధ్రప్రదేశ్లో రైతు ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోందని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితోనే ఇలా జరుగుతోందని ఆరోపించారు. రైతు భరోసా పథకం ఒక్కటే అమలైతే చాలని కేంద్ర పథకాలను మరుగన పడేసిందని విమర్శించారు. దేశమంతా అమలయ్యే యాంత్రీకరణ, ఆర్కేవీవై, స్మామ్, బిందు తుంపర్ల సేద్యం, పీకేవీవై వంటి కేంద్ర పథకాలను పూర్తిగా అమలు చేయకపోవడం రైతులపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ప్రకృతి అనుకూలించి వర్షాలు, వరదలు వచ్చినా సద్వినియోగం చేసుకోవడంలోనూ ప్రభుత్వం విఫలమైందని అందుకే ఆత్మహత్యలు పెరిగాయన్నారు.
నగదు బదిలీ విధానంలో నష్టాలు ఎక్కువ...
వ్యవసాయానికి ఉచిత కరెంట్ విషయంలో నగదు బదిలీ విధానం తగదని సోమిరెడ్డి హితవు పలికారు. నూతన విధానంలో జరిగే ప్రయోజనాల కన్నా నష్టాలే ఎక్కువన్నారు. ప్రస్తుతం జీతాలు, పింఛన్లు 1వ తేదీ చెల్లించలేని పరిస్థితుల్లో ప్రభుత్వముందని, ఈ క్రమంలో ప్రభుత్వం రైతుకు సకాలంలో చెల్లించకపోతే తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముందన్నారు. ఖాతాలో పడిన నగదును కొందరు రైతులు ఇతర అత్యవసరాలకు వాడుకోవాల్సిరావడం, కొన్ని సందర్భాల్లో బ్యాంకర్లు బాకీ కింద జమ చేసుకునే అవకాశాలూ ఉన్నాయని అలాంటప్పుడు రైతులు సకాలంలో బిల్లులు చెల్లించక కనెక్షన్లు కట్ అయితే అంతిమంగా పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ అప్పట్లోనే మీటర్ల విధానాన్ని తొలగించి శ్లాబ్ పద్ధతితో నామమాత్రపు చార్జీలు అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వాలు దానిని మరింత సరళతరం చేశాయన్నారు. ఇప్పుడు మళ్లీ మీటర్లంటే రైతుకు పూర్తిగా అన్యాయం చేయడమేనని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:వ్యవసాయ విద్యుత్తుకు నగదు బదిలీ