వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి... తన ఇంట్లోని పని మనుషులను బినామీ డైరెక్టర్లుగా పెట్టుకుని అదాన్ డిస్టిలరీస్‌ను నడిపిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఆ సంస్థ రూ.10.60 కోట్లు చేబదుళ్లుగా పొందినట్లు ఆడిట్ రిపోర్టులో ఉందని, ఈ సొమ్ముంతా విజయసాయిరెడ్డిదేనని స్పష్టం చేశారు. అదాన్ డిస్టిలరీస్‌లో మొదట విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డి, సీఎం జగన్ బంధువు ముప్పిడి అనిరుధ్‌రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారని, ఆ విషయాన్ని తెదేపా బయటపెట్టడంతోనే కాశీచయనుల శ్రీనివాస్, బొల్లారం శివకుమార్‌లను డైరెక్టర్లుగా పెట్టుకున్నారని వివరించారు. వీరిద్దరి ప్రొఫైళ్లు ఏంటనేది ఎంత వెతికినా దొరకలేదని, ఇద్దరూ జగన్, విజయసాయిరెడ్డిల బినామీలేననేది స్పష్టమవుతోందని ఆరోపించారు. మంగళగిరిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దమ్ముంటే శ్రీనివాస్, శివకుమార్ తామెవరో ప్రజలకు చెప్పాలని డిమాండు చేశారు.
ఫోరెన్సిక్ ఆడిట్‌కు సిద్ధమా?
‘బెవరేజస్ కార్పొరేషన్ అమ్ముతున్న మద్యంలో 75% జగన్, విజయసాయిరెడ్డి బినామీ కంపెనీల్లో తయారయ్యేదే. కార్పొరేషన్ ఖాతాల్ని ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తే ఆ విషయం బయటపడుతుంది. దీనికి వారిద్దరూ సిద్ధమేనా? 2019 డిసెంబరు 2న ప్రారంభమైన అదాన్ డిస్టిలరీస్ కంపెనీ టర్నోవర్ రూ.3వేల కోట్లు దాటింది. ఆ కంపెనీ కార్యాలయం హైదరాబాద్‌లో 1,100 అడుగుల విస్తీర్ణంలో ఉంది. అంతటి తక్కువ విస్తీర్ణంలోనే డిస్టిలరీ కార్యకలాపాలు సాధ్యమేనా? అదాన్ డిస్టిలరీస్‌లో రూ.50వేల పెట్టుబడి పెట్టి రెండేళ్లలో దాని టర్నోవర్‌ను రూ.2,500 కోట్లకు తీసుకెళ్లారు. మద్య నిషేధం అమలు చేస్తామంటూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన సీఎం జగన్ ఇప్పుడు ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.25వేల కోట్ల విలువైన మద్యం అమ్మారు. అదాన్ డిస్టిలరీస్ లాంటి బినామీ కంపెనీలు మరిన్ని ఉన్నాయి. ఆ వివరాలనూ బయటపెడతాం. అదాన్ డిస్టిలరీస్ సరఫరా చేసే మద్యం క్వార్టర్ బాటిల్‌ను ఏపీఎస్‌బీసీఎల్ రూ.36కు కొనుగోలు చేసి రూ.200కు అమ్ముతోంది.