తెలుగు అకాడమీ పేరును రాష్ట్ర ప్రభుత్వం తెలుగు- సంస్కృత అకాడమీగా మార్చింది. అకాడమీ పాలకమండలికి తెలుగుభాష, సైన్సు, సోషల్ సైన్సు, వృత్తి విద్య (ఇంజినీరింగ్/ వైద్య) సబ్జెక్టుల్లో ప్రత్యేక పరిజ్ఞానమున్న నలుగురు సభ్యులను నియమిస్తున్నట్లు ప్రకటించింది. శ్రీవెంకటేశ్వర వర్సిటీ రసాయనశాస్త్ర విభాగం విశ్రాంత ఆచార్యులు భాస్కర్‌రెడ్డి, జ్యోతిషశాస్త్రం ఉపాధ్యాయుడు, కౌన్సెలర్ రాజకుమార్ నేరెళ్ల, గుంటూరు జేకేసీ కళాశాల విశ్రాంత తెలుగు సహ ఆచార్యులు విజయశ్రీ, ఎస్‌ఆర్‌ఎస్‌వీ బీఈడీ కళాశాల అధ్యాపకుడు కప్పగంతు రామకృష్ణను పాలకమండలి సభ్యులుగా నియమించారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా స్థానం కల్పించారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి వి.మురళీధరశర్మను యూజీసీ నామినీగా నియమించారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎం తెలుగు అకాడమీ చరిత్ర తెలుసుకోవాలి: బుద్ధప్రసాద్
ముఖ్యమంత్రి జగన్ తెలుగు అకాడమీ చరిత్ర, లక్ష్యాలను తెలుసుకోవాలని, తెలుగు వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరించడం మంచిది కాదని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. తెలుగు అకాడమీని తెలుగు- సంస్కృత అకాడమీగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విచారకరమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో 1968లో తెలుగు అకాడమీని ఏర్పాటు చేశారని.. పరిశోధనలు, ఆధునీకరణ, భాషా వ్యాప్తికి కృషి చేయడం ఈ సంస్థ లక్ష్యమని వెల్లడించారు. అప్పటి విద్యా శాఖ మంత్రి పీవీ నరసింహారావు తెలుగు అకాడమీకి తొలి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ‘మన మాతృభాషను గౌరవించుకోవడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం కావాల్సింది పోయి, తెలుగు భాషను అంతం చేయడానికి పుట్టినట్లు వ్యవహరించడం బాధాకరం. ఇప్పటికే మాతృభాష మాధ్యమానికి మంగళం పాడారు. ఇక తెలుగు సంస్థల వంతు వచ్చినట్లుంది. సీఎంకు నిజంగా తెలుగు మీద ప్రేమాభిమానాలుంటే తెలుగు అకాడమీని అలాగే కొనసాగించి, నిధులివ్వాలి. లక్ష్మీపార్వతి అధ్యక్షురాలిగా నామమాత్రంగా తెలుగు అకాడమీని ఏర్పాటు చేశారే తప్ప నిధులివ్వలేదు. చేసిన పనులూ లేవు. రాష్ట్ర ప్రభుత్వానికి సంస్కృతంపై ప్రేమ ఉంటే ప్రత్యేక సంస్కృత అకాడమీ ఏర్పాటు చేయాలి’ అని వెల్లడించారు.