ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Telangana Temperature Drops : చలి గుప్పిట్లో తెలంగాణ...గజగజ వణుకుతున్న ప్రజలు

Telangana Temperature Drops : తెలంగాణను చలిపులి గజగజ వణికిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. హైదరాబాద్​ మహానగరంలో ఆదిలాబాద్​ జిల్లాలో నమోదయ్యే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. అడవుల జిల్లా తెల్లవారుజామున కురుస్తున్న పొగమంచుతో కశ్మీర్​ను తలపిస్తోంది. మరోవారం రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో చలిముప్పును తట్టుకోవడానికి అప్రమత్తత అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశమున్నందున అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.

By

Published : Dec 21, 2021, 9:38 AM IST

ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం అంకోలి వాగులో నీటిపై ఆవరించిన పొగమంచు
ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం అంకోలి వాగులో నీటిపై ఆవరించిన పొగమంచు

Telangana Temperature Drops : తెలంగాణ రాష్ట్రంపై చలి పంజా విసురుతోంది. మరో రెండు వారాలూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా నాలుగైదు డిగ్రీలు తక్కువగా ఉంటున్నాయని తెలిపింది. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉండనుంది. సోమవారం తెల్లవారుజామున రాష్ట్రంలో అత్యల్పంగా సిర్పూరు(కుమురంభీం జిల్లా)లో 6, మెదక్‌లో 8.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నందున చలి అధికంగా ఉంటోందని వాతావరణ కేంద్రం రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు.

Lowest Temperature Telangana : ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గితే ఆరోగ్య సమస్యలు విజృంభించే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. చలి ముప్పును తప్పించుకోవడానికి ముందు జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు. ఇప్పటికే ఫ్లూ జ్వరాలు, నిమోనియా, ఆస్తమా తదితర వ్యాధులతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు. చలి తీవ్రత పెరిగే కొద్దీ గుండెపోటు ముప్పు కూడా అధికంగా ఉంటుందనీ.. ఈ సమయంలో పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. వారిలో వ్యాధుల తీవ్రత ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Telangana Suffers From Cold : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో వేకువజామునే దట్టమైన పొగమంచు కురుస్తుండగా.. రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం అంకోలి వాగులో సోమవారం నీటిపై ఆవరించిన పొగమంచు ఇలా..

ఎవరికి ప్రమాదం?

  • ఐదేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు
  • అవయవ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నవారు
  • మధుమేహులు
  • క్యాన్సర్‌, గుండెజబ్బు, ఆస్తమా, సీవోపీడీ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారు

ముందు జాగ్రత్తలివీ..

  • చలి తీవ్రంగా ఉన్న సమయంలో ఉదయపు నడకకు, ఇతర అవసరాలకు బయటకు వెళ్లకపోవడమే మంచిది. అత్యవసరమై వెళ్తే శరీరమంతటినీ కప్పి ఉంచేలా దళసరి వస్త్రాలు ధరించాలి. మఫ్లర్‌ వంటివి వాడాలి.
  • వేడివేడి ఆహార పదార్థాలనే తీసుకోవాలి.
  • గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
  • తీవ్ర చలి కారణంగా చేతులు పట్టుతప్పుతాయి.. రాత్రిళ్లు వాహనాలు నడపకపోవడమే మంచిది.

మాయిశ్చరైజర్లు వాడుకోవాలి

Health Problems in Winter : "వాతావరణంలో తేమ శాతం బాగా తగ్గిపోవడంతో.. చర్మం కూడా ఎండిపోతుంది. గ్లిజరిన్‌ ఉండే సబ్బులను వాడుకోవాలి. స్నానం చేసేటప్పుడు శరీరాన్ని బాగా రుద్దుకోవద్దు. ఆ వెంటనే తడి ఒంటిపైనే తేమనిచ్చే ద్రావణాలను, లేపనాలను పూయాలి. పెదవులకు గ్లిజరిన్‌ తరహా లేపనాలను వాడాలి. కాస్మోటిక్స్‌ ఎక్కువగా వాడకపోవడమే మంచిది. దురద, సొరియాసిస్‌తో బాధపడుతున్న వారికి చలికాలంలో ఆ బాధలు ఎక్కువవుతాయి. మధుమేహుల్లో చర్మం పొడిబారగానే పగుళ్లు ఏర్పడతాయి. వాటిలోకి బ్యాక్టీరియా, ఫంగస్‌ తదితర సూక్ష్మక్రిములు చొచ్చుకుపోతాయి. దీంతో ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత పెరుగుతుంది."

- పుట్టా శ్రీనివాస్‌, ప్రముఖ చర్మ వైద్య నిపుణులు

బహిరంగ ప్రదేశాలకు వెళ్లకపోవడమే మేలు

Health Issues in Winter : "చలికాలంలో శ్వాసనాళాలు సంకోచిస్తాయి. దీంతో ఆస్తమా, సీవోపీడీ రోగులకు సమస్య తీవ్రమవుతుంది. ఈ వ్యాధులతో బాధపడే వారి మరణాలు చలికాలంలోనే ఎక్కువ. అందుకే తప్పనిసరిగా వ్యాధిని నియంత్రణలో ఉంచుకునే ఔషధాలను వాడుకోవాలి. ఎక్కువగా బహిరంగ ప్రదేశాలకు వెళ్లకపోవడం మేలు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్కు ధరించాలి. ఇప్పుడు ఒమిక్రాన్‌ ముప్పూ పొంచి ఉంది కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ప్రస్తుతం ఫ్లూ, న్యుమోనియాలకు రోగ నిరోధక టీకాలు అందుబాటులో ఉన్నాయి."

- శుభాకర్‌, శ్వాసకోశ వైద్య నిపుణులు

రక్తనాళాలు సంకోచిస్తాయి

Winter in Telangana : "శీతాకాలంలో కండరాలు, ఎముకలు, కీళ్లు బిగుసుకుపోయి నొప్పులు ఎక్కువవుతాయి. రక్తనాళాలు కూడా సంకోచిస్తాయి. తద్వారా గుండె, మెదడుల్లో ఉన్నట్టుండి రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడి గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్ర జబ్బుల బారినపడే ప్రమాదం పొంచి ఉంది. చలిని తట్టుకునేందుకు కొందరు అతిగా ధూమపానం చేస్తారు. మద్యం మోతాదుకు మించి తీసుకుంటుంటారు. దీనివల్ల గుండె స్పందనల్లో లయ తప్పుతుంది. అత్యంత వేగంగా కొట్టుకుంటుంది. ఈ పరిస్థితుల్లో నిద్రలోనే చనిపోతుంటారు. చలికాలంలో కొలెస్ట్రాల్‌ స్థాయి కూడా పెరుగుతుంది. గుండెజబ్బు, మధుమేహం, అధిక రక్తపోటుకు మందులు వాడుతున్నవారు.. ఔషధ మోతాదుల హెచ్చుతగ్గులపై వైద్యుడిని సంప్రదిస్తే మంచిది. చలి ఎక్కువగా ఉంది కదా అని టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోవడమూ ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు."

- ఎంవీ రావు, ప్రముఖ జనరల్‌ ఫిజీషియన్‌

ABOUT THE AUTHOR

...view details