కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నందున ఐసీఎంఆర్ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. కరోనా కేసులు ఎక్కువగా వచ్చే ప్రాంతాలను కంటైన్మెంట్ ప్రాంతాలుగా గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని సూచించించి. రోజూ 50 వేల ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు తెలిపింది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని, పాఠశాల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని.. రోజూ 50 వేల పరీక్షలు నిర్వహించడం లేదని చిక్కుడు ప్రభాకర్ వాదించారు. ఈ నెల 7, 11, 12, 13 తేదీల్లో వైద్యఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్లలోనే 50 వేల పరీక్షలు నిర్వహించినట్లు లేదన్నారు. ఆ అంశం కోర్టు ధిక్కరణగా పరిగణించాలని ప్రభాకర్ కోరారు.