ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, వ్యవసాయ ఆస్తుల నమోదుకు వివరాల సేకరణపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ధరణిలో ఆస్తుల నమోదు కోసం.. యజమానుల వ్యక్తిగత వివరాలను సేకరించడాన్ని సవాల్ చేస్తూ... దాఖలైన మూడు వేర్వేరు ప్రజా ప్రయోజనాలపై ధర్మాసనం విచారణ చేపట్టింది. చట్టాలు, సుప్రీం కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఆధార్, కులం వివరాలు సేకరిస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. భూ యజమానుల కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు అడుగుతున్నారని పేర్కొన్నారు. ధరణిలో వివరాలు లేకపోతే.. ఎలాంటి భూలావాదేవీలు జరగవని సీఎం చెబుతున్నారని వివరించారు. సేకరించిన వివరాలన్నీ వెబ్ సైట్ ద్వారా ప్రజా బాహుళ్యంలో అందుబాటులోకి వస్తాయని.. దానివల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందని హైకోర్టుకు వివరించారు.
ఎలా భద్రత కల్పిస్తారు?
నూతన రెవెన్యూ చట్టం ప్రకారం ధరణి పోర్టల్ ఏర్పాటు చేశారని.. అయితే ఆ చట్టంలో వ్యవసాయేతర భూముల ప్రస్తావన లేదని హైకోర్టు పేర్కొంది. ఆధార్, కులం వివరాల సేకరణపై రెవెన్యూ చట్టంలో ఎక్కడా వివరించలేదని తెలిపింది. సేకరించిన వివరాలకు ఎలా భద్రత కల్పిస్తారు? ఆ వివరాలు ఎవరి ఆధీనంలో ఉంటాయి? ఎవరెవరు వాటిని పరిశీలించవచ్చన్న అంశాలను చట్టంలో ప్రస్తావించలేదని తెలిపింది.
తీవ్ర విఘాతం కలుగుతుంది..
వివరాల సేకరణ, భద్రతకు సంబంధించి ఐటీ చట్టంలోని అంశాలను... నూతన రెవెన్యూ చట్టంలో పొందుపరచలేదని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఏ చట్టం ప్రకారం ఆధార్, కులం, వ్యవసాయేతర వివరాలు సేకరిస్తున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నంచింది. ధరణిలో వ్యక్తిగత వివరాల నమోదు చట్టబద్ధం కాదన్న పిటిషనర్ల వాదనలో ప్రాథమికంగా బలం కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఎవరైనా డేటా దుర్వినియోగానికి పాల్పడితే ప్రజల వ్యక్తిగత గోప్యతకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.