ఖైరతాబాద్ మహాగణపతికి తెలంగాణ గవర్నర్ తమిళిసై తొలిపూజ తెలంగాణ రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతి(Khairtabad Ganesh) ఈఏడు తన తొలిపూజను అందుకున్నాడు. గవర్నర్ తమిళిసై, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయలు వినాయకునికి తొలి పూజ చేశారు. అర్చకుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాల మధ్య విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అంతకుముందు.. ఇరు రాష్ట్రాల గవర్నర్లకు ఖైరతాబాద్ గణేశ్(Khairtabad Ganesh) ఉత్సవ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. పూజ అనంతరం.. శాలువా కప్పి సత్కరించారు. అనంతరం మహాగణపతికి తొలిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
పూజ అనంతరం గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతికి తొలిపూజ చేయడం తన అదృష్టమని అన్నారు. కరోనా మహమ్మారిని విఘ్నేశ్వరుడు పారదోలాలి అని వేడుకున్నారు.
"ఖైరతాబాద్ గణేశుడి ప్రత్యేకత నాకు చాలా నచ్చింది. ఇక్కడ తొలిపూజ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ గణపయ్య తప్పకుండా కరోనా మహమ్మారిని తరిమికొడతాడు. దేవుడున్నాడు కదా అని.. మనం అజాగ్రత్తగా ఉండొద్దు. దర్శనానికి వచ్చే ప్రతిఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలి. వీలైనంత త్వరగా అందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి."
- తమిళిసై సౌందరరాజన్, గవర్నర్
ఇదీ చదవండి :చవితి నైవేద్యాలు: 'డ్రై ఫ్రూట్ మోదక్' చేసుకోండిలా!
ఖైరతాబాద్ గణేశుణ్ని (Khairtabad Ganesh) తెలంగాణ పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా ఉత్సవ కమిటీ.. ఈయేడు ఏర్పాట్లు పకడ్బందీగా చేసిందని చెప్పారు. కొవిడ్ మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తులంతా కరోనా నిబంధనలు ఉల్లంఘించకుండా గణపయ్యను దర్శించుకోవాలని చెప్పారు. మంత్రి వెంట ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నారు. ఆయన అక్కడే ఉండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. సులభంగా దర్శనం చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నారు.