ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయస్థానాల్లో కేసులు ఉపసంహరించుకుంటే విద్యుత్ బకాయిలతో పాటు రాష్ట్ర ఆర్థికసంస్థ వ్యవహారాన్ని పరిష్కరించుకునేందుకు సిద్ధమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆశిష్ కుమార్ అధ్యక్షతన విభజన వివాదాల పరిష్కార ఉపసంఘం మొదటి సమావేశం జరిగింది. దృశ్య మాధ్యమం ద్వారా జరిగిన సమావేశంలో హైదరాబాద్ బీఆర్కే భవన్ నుంచి తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సంబంధితశాఖల అధికారులు హాజరయ్యారు. ఐదు అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది.
కోర్టు కేసులు ఉపసంహరించుకుంటే ... సమస్య పరిష్కారానికి సిద్ధం
విద్యుత్ విషయంలో ఏపీ నుంచి తమకు రూ.12,532 కోట్లు రావాల్సి ఉందని, అయితే వాటిని పరిగణనలోకి తీసుకోకుండా తామే రూ.3,442 కోట్లు చెల్లించాలని ఏపీ అడుగుతోందని తెలంగాణ అధికారులు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో ఆకస్మాత్తుగా పీపీఏలు రద్దు చేసి ఏపీ జెన్కో నుంచి విద్యుత్ నిలిపివేయడం, తక్కువ ధరతో వచ్చే సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి విద్యుత్ తీసుకోకుండా చేయడం వల్ల తెలంగాణకు చాలా నష్టం జరిగిందని వివరించారు. తెలంగాణకు రావాల్సిన రూ.12,532 కోట్లు ఇవ్వకుండా ఏపీ కోర్టుకు వెళ్లిందని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శికి అధికారులు చెప్పారు. విద్యుత్ బకాయిలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించుకొని పరిష్కరించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే ఏపీ కోర్టు కేసు ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా చేసి ప్రతిపాదనలు పంపిందన్న తెలంగాణ అధికారులు.. కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా 235 ఎకరాలకు సంబంధించి కోర్టును ఆశ్రయించిందని చెప్పారు. ప్రధాన కార్యాలయం కాని నానక్‌రామ్‌గూడలోని కార్యాలయ భవనంలో వాటా అడగడం సమంజసం కాదన్నారు. వీటన్నింటి కారణంగా ఏపీఎస్‌ఎఫ్‌సీ విభజన పెండింగ్‌లో పడిందని, కోర్టు కేసులు ఉపసంహరించుకుంటేనే విభజన ప్రక్రియలో తదుపరి ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొందని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు.