పీఆర్సీ ప్రకటనతో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగుల సంబురాలు పీఆర్సీ ప్రకటనతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. 30 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించటంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బాణాసంచా కాల్చి... సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విధి నిర్వహణలో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని హర్షం వ్యక్తం చేశారు.
సీఎంకు కృతజ్ఞతలు
ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ సహా, ఇతర సమస్యలను పరిష్కరిస్తూ అసెంబ్లీలో ప్రకటన చేసిన సందర్భంగా పలు ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో కలిశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ సహా నేతలు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
థాంక్యూ సీఎం గారూ..!
ముఖ్యమంత్రి కేసీఆర్ 30శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడం పట్ల ఉద్యోగసంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. సెక్రటేరియట్ వద్ద ఉద్యోగులు నృత్యాలు చేస్తూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ఉద్యోగులు గౌరవంగా పనిచేసుకునేలా చేశారని టీఎన్‌జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పేర్కొన్నారు. పదవీ విరమణ వయసు 61సంవత్సరాలకు పెంచడం సంతోషకరమన్నారు. ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదని మరోసారి రుజువైందని టీజీవో అధ్యక్షురాలు మమత పేర్కొన్నారు.
మరింత ఉత్సాహంతో..
హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీఓస్ భవన్ ముందు బాణాసంచా కాల్చి ఉద్యోగులు మిఠాయిలు పంచుకున్నారు. టీజీవో భవన్ ముందు నృత్యాలు చేస్తూ సంబురాలు చేసుకున్నారు. ఉద్యోగులంతా గౌరవంగా పనిచేసుకుంటామని పేర్కొన్నారు. సిద్దిపేట అంబేడ్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. 30శాతం ఫిట్‌మెంట్‌పై హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో టీఎన్‌జీవో భవన్ ఎదుట సంబురాలు చేసుకున్న ఉద్యోగులు... రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. పదవీ విరమణ వయస్సు పెంపు సంతోషకరమని అన్నారు. ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉద్యోగులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. జగిత్యాల తహసీల్ చౌరస్తాలో రెవెన్యూ ఉద్యోగులు టపాసులు పేల్చారు.
ఇదీ చదవండి:
నెల్లూరు వీఆర్సీ కళాశాలలో అగ్ని ప్రమాదం