తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన అరుణ డిప్యూటీ తహసీల్దారుగా ఎంపికై పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆమె భర్త ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ఆర్థిక అవసరాల నిమిత్తం అరుణ తన తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయం చేస్తున్నారు. ‘గ్రూప్-2 ఉద్యోగం నా కల. 2016 నుంచి పోరాడుతూనే ఉన్నా. గత ఏడాది డిసెంబరులో నియామక ఉత్తర్వు ఇచ్చారు. కొద్దిరోజులు శిక్షణ సైతం ఇచ్చారు. అంతే... ఏడు నెలలు గడుస్తున్నా పోస్టింగ్ ఇవ్వలేదు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రూప్-2లో ఎంపికై డిప్యూటీ తహసీల్దారు ఉద్యోగానికి ఎంపికైనవారి కల పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు. ఉద్యోగం వచ్చిందన్న ఆనందం తప్ప రోజూవారీ కూలీ పనులు చేయనిదే పూట గడవడం లేదు. నిరుపేద కుటుంబాలకు చెందిన వారు రూ.వేలు ఖర్చుచేసి ఉద్యోగ శిక్షణ పొందారు. 2016 నవంబరులో పరీక్ష రాశారు. ఎట్టకేలకు వారికి 2019 డిసెంబరులో నియామక ఉత్తర్వులు ఇచ్చారు. ఫిబ్రవరిలో శిక్షణా ఇచ్చారు. పోస్టింగులు మాత్రం ఇవ్వలేదు.
డీటీలుగా ఎంపికైన 259 మంది అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గ్రూప్-2లో ఉద్యోగాలు పొందిన పలు కేటగిరీలకు చెందినవారికి ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. వాణిజ్యపన్నుల శాఖ, ఆబ్కారీ శాఖలకు ఎంపికైనవారు ఇప్పటికే విధులు నిర్వర్తిస్తున్నారు. డీటీలుగా ఎంపికైనవారు మాత్రం ఉద్యోగం లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఉపాధిహామీ, భవన నిర్మాణ పనులకు వెళ్తున్నారు. మరికొందరు వ్యవసాయ పనులకు వెళ్తున్నారు.
ఉన్న ఉద్యోగాలకు రాజీనామా చేసినా..