తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై ఈ నెల 25న కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. భేటీలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, న్యాయనిపుణులతో సమావేశమైన సీఎం.. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం విషయమై చర్చించారు. ఈ నెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం విషయంలో తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. అజెండాలో చేర్చాల్సిన అంశాలను కూడా.. ఆ లేఖలో పేర్కొంటామని సీఎం తెలిపారు.
కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలన్నింటినీ... భేటీలో నివృత్తి చేస్తామని స్పష్టం చేశారు. నదీజలాల వినియోగం విషయంలో తెలంగాణ రాష్ట్రానికున్న అభ్యంతరాలను కూడా కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తుతామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులపై కేంద్రం, ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అన్ని సందేహాలను కౌన్సిల్ సమావేశంలో నివృత్తి చేయాలని... అందుకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్రం, ఏపీ వ్యక్తం చేసిన అభ్యంతరాలన్నీ అర్థం పర్థం లేనివేనని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులనే... తెలంగాణ అవసరాలను తీర్చే విధంగా రీడిజైన్ చేశామని అన్నారు. ఇదే విషయాన్ని ఆధారాలతో సహా... కౌన్సిల్ సమావేశంలో వివరించాలని నిర్ణయించారు. ఆయా ప్రాజెక్టుల మంజూరు, కేటాయించిన నిధులు, తెలంగాణ వచ్చే నాటికే చేసిన ఖర్చు.. అప్పటికే సేకరించిన భూమి, కేటాయించిన టీఎంసీలు తదితర వివరాలను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వాడకానికి సంబంధించి బచావత్ ట్రైబ్యునల్ అవార్డుకు అనుగుణంగానే.. రాష్ట్రం వ్యవహరిస్తోందన్న విషయాన్ని ఆధార సహితంగా వివరించాలని చెప్పారు.
పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుతో పాటు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై.. గట్టిగా అభ్యంతరం చెప్పాలని కేసీఆర్ నిర్ణయించారు. నీటి కేటాయింపులు, అనుమతులు లేకున్నా.. ట్రైబ్యునల్ అవార్డుకు భిన్నంగా గోదావరి, కృష్ణా నదుల్లో ఆంధ్రప్రదేశ్ అక్రమంగా వాడుకుంటున్న నీటి విషయమై కూడా సమావేశంలో నిలదీయాలని చెప్పారు. అందుకు సంబంధించి కూడా సమగ్ర సమాచారాన్ని, అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నదీజలాల వినియోగం విషయంలో... తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై గతంలో అనేక సార్లు ఫిర్యాదు చేశామని.. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనైనా చర్చించి న్యాయం చేయాల్సిందిగా కోరతామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.