ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TS CM KCR INVITES MODI:యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీకి ఆహ్వానం - telangana varthalu

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పున:ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. ప్రధాన పనులన్నీ పూర్తయిన నేపథ్యంలో స్వయంభూ దర్శనానికి భక్తులను అనుమతించేలా ఆలయ ఉద్ఘాటన చేయనున్నారు. ప్రారంభోత్సవానికి అనుగుణంగా మిగిలిన పనులను వేగవంతం చేయనున్నారు. అక్టోబర్ లేదా నవంబర్​లో ఆలయ పున:ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు.

యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీకి ఆహ్వానం
యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీకి ఆహ్వానం

By

Published : Sep 4, 2021, 3:33 AM IST

Updated : Sep 4, 2021, 4:58 AM IST

అద్భుత పుణ్యక్షేత్రంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం రూపుదిద్దుకుంటోంది. కాకతీయ శైలిలో శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా పూర్తిగా కృష్ణశిలతోనే ఆలయాన్ని పునరుద్ధరించారు. మండపాలు, ప్రాకారాలు, గోపురాలు, శిల్పాలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. మాడవీధులు ఉండేలా ఆలయాన్ని గుట్టపై పూర్తి స్థాయిలో విస్తరించారు. ప్రధాన ఆలయ పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా క్యూలైన్ల కోసం ఇత్తడితో కూడిన రెయిలింగ్​ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆలయ ద్వారాలకు ఇత్తడి తొడుగులు అమర్చుతున్నారు. గర్భాలయ ద్వారానికి బంగారు తొడుగులు అమర్చనున్నారు. ప్రసాదం కాంప్లెక్స్ కూడా సిద్దమైంది. స్వామి వారి కైంకర్యాల కోసం కొండపై విష్ణుపుష్కరిణి సిద్దమైంది. దిగువన భక్తుల స్నానాల కోసం లక్ష్మీ పుష్కరిణి పనులు చివరి దశలో ఉన్నాయి. కళ్యాణకట్ట పనులు కొనసాగుతున్నాయి.

పనులు వేగవంతం

గుట్ట నలువైపులా రహదార్ల విస్తరణ పనులు పూర్తి కాగా యాదగిరిగుట్ట పట్టణంలో నుంచి కొండ పైకి వెళ్లే రహదారి మార్గ విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. గుట్ట, రహదారుల వెంట, పరిసరాల్లో పూర్తి స్థాయి పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆలయం వెనకభాగంలో ఈఓ కార్యాలయం, వీవీఐపీ అతిథిగృహం గతంలోనే పూర్తిగా సిద్ధం కాగా... మరో కొండపై ప్రెసిడెన్షియల్ సూట్ సహా కాటేజీలు సిద్ధమయ్యాయి. ఫర్నీచర్​ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సూచనలకు అనుగుణంగా పనులను వేగవంతం చేశారు. ఇటీవలి వర్షాల కారణంగా పనులకు కొంత అంతరాయం కలిగింది. ఆలయ అభివృద్ధి, ఇతర పనుల కోసం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 1200 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది.

ప్రధానికి ఆహ్వానం

పనులు తుది దశకు చేరిన నేపథ్యంలో ఆలయ పున:ప్రారంభానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఆలయ ఉద్ఘాటన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. త్వరలోనే ముహూర్తం ఖరారు చేయనున్నారు. అందుకు అనుగుణంగా మిగతా పనులను వేగవంతం చేయనున్నారు. యాదాద్రి ఆలయ పున:ప్రారంభోత్సవం సందర్భంగా భారీగా మహాసుదర్శనయాగం నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో భావించారు. కొవిడ్ నేపథ్యంలో ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇదీ చదవండి:MAA Elections: ప్రకాశ్​రాజ్ ప్యానెల్​లోకి జీవిత, హేమ

Last Updated : Sep 4, 2021, 4:58 AM IST

ABOUT THE AUTHOR

...view details