BOTSA SATYANARAYANA : ఉపాధ్యాయ సంఘ నేతలతో నేడు రెండు అంశాలపై సమావేశం జరిగిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 670 ఎంఈఓ పోస్టులు భర్తీ చేయాలని సీఎం చెప్పారని పేర్కొన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం పెండింగ్‌లో ఉన్న 248 ప్రభుత్వ టీచర్లను సీనియారిటీ ఆధారంగా మండలానికి ఎంఈఓలుగా నియమిస్తామని వెల్లడించారు.
ముఖ ఆధారిత యాప్‌పై వస్తున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలనేదే ముఖ్యమంత్రి భావన అని తెలిపారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని అన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. టీచర్లపై పెట్టిన కేసుల విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు.
"ఉద్యోగసంఘాల నేతలతో రెండు అంశాలపై చర్చించాం. ఫేస్ యాప్ హాజరుపై వస్తున్న సమస్యలను త్వరగా పరిష్కరిస్తాం. మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తెస్తే తప్పకుండా పరిష్కరిస్తాం. టీచర్లపై పెట్టిన కేసుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాం. ఇవాళ 86 శాతం మంది యాప్‌లో హాజరు నమోదు చేశారు. సర్వీస్ రూల్స్‌లో ఉన్నవాటినే అమలుచేస్తున్నాం. ఉపాధ్యాయులు, విద్యార్థులకు మంచి చేయాలనేదే మా తపన." -బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి