ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసే వరకు జగన్ నిద్రపోయేలా లేరన్న తెదేపా నేత యనమల - జగన్

TDP YANAMALA ON JAGAN రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసే వరకు జగన్ నిద్రపోయేలా లేరని తెదేపా నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఓడీ కింద తెచ్చిన రూ.31 వేల కోట్లు దేనికి ఖర్చుపెట్టారో చెప్పాలని డిమాండ్​ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం కేవలం 5నెలల్లోనే రూ.46,803 కోట్లు అప్పు చేశారని పేర్కొన్నారు.

TDP YANAMALA
TDP YANAMALA

By

Published : Aug 28, 2022, 6:22 PM IST

TDP leader Yanamala comments on YS Jagan: జగన్ ప్రభుత్వానివన్నీ ఆర్థిక ఉల్లంఘనలేనని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే వరకు జగన్ నిద్రపోయేట్టు లేడని.. రాజ్యాంగాన్ని, ఎఫ్​ఆర్​బీఎం నిబంధనలను సైతం లెక్క చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి సోమనాథన్ రాసిన లేఖ ఇందుకు నిదర్శనమన్నారు.

సీఎఫ్‌యంయస్‌ను బైపాస్‌ చేస్తూ దొడ్డిదారిలో బిల్లులు చెల్లించారని దుయ్యబట్టారు. ట్రెజరీ కోడ్​ను ఉల్లంఘించి ప్రత్యేక బిల్లుల కింద 48వేల 284.32 కోట్ల రూపాయలను తన అనుచరులకు దోచిపెట్టారని.. దీన్ని కప్పిపెట్టుకోవడానికి జీవో నెం.80 విడుదల చేశారని మండిపడ్డారు. వేస్ అండ్ మీన్స్ ద్వారా 1.04 లక్షల కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు, ఓడీ కింద రూ.31 వేల కోట్లు తీసుకొచ్చి దేనికి ఖర్చుపెట్టారో కూడా లెక్కలు చెప్పలేదని ఆక్షేపించారు.

మద్యంపై బాండ్లు, ఏపీఎస్​డీసీ అప్పులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3)కి పూర్తిగా విరుద్ధమని ధ్వజమెత్తారు. దేశంలోనే అత్యధికంగా అప్పులు తీసుకున్న ప్రభుత్వం కూడా వైకాపానేనని స్పష్టం చేశారు. తెదేపా ఏడాదికి కేవలం 35 రోజులు ఓడీకి వెళితే వైకాపా 102 రోజులు వెళ్లిందన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం ఐదు నెలల కాలంలోనే రూ.46వేల 803 కోట్లు అప్పు చేశారన్నారు. తెదేపా దిగిపోయే నాటికి 13వేల899 కోట్లు ఉన్న రెవెన్యూ లోటు.. వైకాపా పాలనలో రూ. 35వేల 441 కోట్లకు చేరిందని మండిపడ్డారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details