గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరల పెంపును నిరసిస్తూ తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో మచిలీపట్నంలో మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గ్యాస్ బండకు పాడే కట్టి ప్రధాన రహదారిలో శవ యాత్ర నిర్వహించారు. నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ ధరల పెంపును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిరసన కార్యక్రమంలో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, తెదేపా మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షులు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, తెలుగు మహిళ మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్డు సెస్..
పెంచిన పెట్రోల్, డీజిల్,గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడలో అర్ధ నగ్న ప్రదర్శనతో వినూత్నంగా నిరసన తెలిపారు.నాడు ప్రతిపక్ష నేతగా ధరలపై బాదుడే బాదుడే అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి నేడు అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్రం విపరీతంగా పెంచుకుంటూ పోతుంటే ఎందుకు స్పందించడం లేదని టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు విమర్శించారు.