వైకాపా రంగుల ప్రచారానికి తప్ప దిశ చట్టాలు, యాప్‌తో ఉపయోగం లేదని తెదేపా మహిళా నేతలు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, గద్దె అనురాధలు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న వరుస దాడుల్ని నివారించే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. రెండేళ్లుగా రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని...నేరస్థుల్ని ప్రోత్సహించేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని వారు మండిపడ్డారు.
ఈ నెల 19న సీతానగరం వద్ద యువతిపై అత్యాచారం ఘటన మరువక ముందే 22వ తేదీన మైలవరం మండలం లోలుకోడు గ్రామంలో ఎస్సీ మహిళ మరియమ్మ అనుమానాస్పద మృతి జరగటం శోచనీయమన్నారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న చట్టాలు సక్రమంగా అమలు చేస్తే మహిళలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.