అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా ? వద్దా? అనే అంశంపై గత కొన్ని రోజులుగా తెదేపాలో చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన వర్చువల్‌గా సమావేశమైన తెదేపా శాసనసభాపక్షం దీనిపై స్పష్టత ఇచ్చింది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని నిర్ణయించారు.
సభకు హాజరుకాకుంటే ప్రత్యామ్నాయ కార్యక్రమాలపై తొలుత పార్టీలో చర్చ జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలని, చర్చలో పాల్గొనాలని మాజీ మంత్రి, సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సూచించారు. దీంతో సీనియర్ నేతల సూచనల మేరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సిందేనని నిర్ణయించారు.
అన్ని సమస్యలను చట్టసభల్లో లేవనెత్తుతాం..
రాష్ట్రంలో నెలకొన్న అన్ని సమస్యలను చట్టసభల్లో లేవనెత్తుతామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీఎల్పీ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. చట్టసభలకు హాజరుకావాలని టీడీఎల్పీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడుతామన్నారు. గతంలో కీలక బిల్లులపై విపక్షాలతోనూ చర్చించేవాళ్లని..,మూడేళ్లుగా విపక్ష సభ్యులకు చట్టసభల్లో అవమానాలు ఎదురయ్యాయని అన్నారు. వైకాపా ప్రభుత్వం ఒంటెత్తుపోకడలతో ముందుకెళ్తోందని అచ్చెన్న మండిపడ్డారు.
"కోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావట్లేదు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి... ఇంతవరకు అమలు చేయట్లేదు. అన్ని సమస్యలను చట్టసభల్లో లేవనెత్తుతాం. సభలో విపక్ష సభ్యులు మాట్లాడేందుకు సమయం ఇవ్వాలి. ఎన్నో సమస్యలపై ప్రజలు మాకు విజ్ఞప్తులు, దరఖాస్తులను ఇచ్చారు. ప్రజలు మా దృష్టికి తెచ్చిన అంశాలను మేం సభలో లేవనెత్తుతాం. కొన్ని మీడియా ఛానెళ్లను ప్రభుత్వం బహిష్కరించటం తగదు. సభ ప్రసారాలకు అన్ని ఛానెళ్లకు అనుమతి ఇవ్వాలి." -అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు
ప్రతిపక్షం, మీడియా అంటే వైకాపాకు భయం..
ప్రతిపక్షం, మీడియా అంటే వైకాపాకు భయం పట్టుకుందని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. సొంత మీడియాతో ఒకపక్షాన్నే చూపిస్తున్నారని ఆక్షేపించారు. మీడియాకు స్వేచ్ఛ లేకుండా చేసే ప్రభుత్వ ప్రయత్నాలు తగవని హితవు పలికారు. తెదేపా మొదట్నుంచి చట్టసభలను దేవాలయంగా భావిస్తోందని.., వైకాపా మాత్రం చట్ట సభలకు రాకుండా రెండేళ్లు పారిపోయిందన్నారు. ప్రభుత్వ తప్పులను ఎండగట్టేందుకే సభకు వెళ్తున్నామన్నారు. తమకు సమయం ఇవ్వకుంటే ప్రభుత్వం పారిపోయినట్లేనని అన్నారు.
విపక్షాల హక్కులను కాలరాయటం తగదు..
శాసనసభలో చంద్రబాబుకు జరిగిన అవమానానికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. విపక్షాల హక్కులు కాలరాసే విధంగా వ్యవహరించటం తగదని హితవు పలికారు. ఆర్థికంగా రాష్ట్రం దివాళా తీసే పరిస్థితుల్లో ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసమే తాము సభలకు వెళ్తామని అన్నారు.
ఇదీ చదవండి
Botsa: ముమ్మాటికీ వికేంద్రీకరణే మా ప్రభుత్వ విధానం: మంత్రి బొత్స