రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా తెలుగు యువత నిరసనలు ప్రపంచ యువజన దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా చంద్రగిరిలో తెలుగు యువత వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. పార్టీ కార్యాలయం నుంచి టవర్ క్లాక్ కూడలిలో వరకు ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఏటా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని తుంగలో తొక్కి ఉన్న పరిశ్రమలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
తూర్పుగోదావరి జిల్లాలో..
రావులపాలెంలో అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు చిలువూరి సతీష్ రాజు ఆధ్వర్యంలో యువత కూరగాయలు, పండ్లు అమ్మారు. నిరసన తెలిపారు. తెలుగు యువత సభ్యులు, కార్యకర్తలు, నాయకులు రైతు బజార్ వరకు ర్యాలీ తీశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రైతు బజార్ లోకి వెళ్లి ఉద్యోగాలు లేవని కూరగాయలు, పండ్లు అమ్ముకుంటూ ప్రజలకు కూరగాయలను విక్రయించి వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.
గుంటూరు జిల్లాలో..
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల 30 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో తెలుగు యువత వినూత్న ఆందోళన చేపట్టింది. ఎన్టీఆర్ కూడలి సమీపంలో పండ్లు, చేపలు అమ్ముతూ నిరసన తెలిపింది. తెదేపా జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్ పేరుతో జగన్మోహన్ రెడ్డి యువతను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో కొత్త కంపెనీలు రాకపోగా.. ఉన్న పరిశ్రమలను వేధించి మూసేయిస్తున్నారని ఆరోపించారు. ఇలాగైతే యువతకు ఉపాధి ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు. తక్షణమే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. లేదంటే.. తెదేపా ఆందోళనలు తీవ్రతరం చేస్తుందని హెచ్ఛరించారు.
విజయనగరం జిల్లాలో..
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువతకు 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా... ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేశారని విజయనగరం తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు వేమల చైత్యన్య బాబు మండిపడ్డారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద తెలుగుయువత ఆధ్వర్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చదవండి:
'పార్లమెంట్ సమావేశాలు జరగలేదనే ప్రజలు అనుకుంటున్నారు'