TDP Strategy Committee Meeting on OTS Scheme: ఓటీఎస్ వసూళ్లు.. పేదల మెడకు ఉరితాళ్లుగా మారాయని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఉచిత రిజిస్ట్రేషన్ కోరుతూ ఈనెల 20న మండల, మున్సిపల్ కార్యాలయాలు, 23న కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ హయాం నుంచి నిర్మించిన ఇళ్లకూ జగన్ రెడ్డి ఓటీఎస్ పేరుతో పేదల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నో ఏళ్లుగా ఆయా ఇళ్లల్లో పేదలు నివసిస్తున్నారని.. ఆ ఇళ్లు వారి సొంతమని చంద్రబాబు స్పష్టం చేశారు. పేదవారి జీవితాలతో ఆడుకుంటున్న జగన్ రెడ్డి తీరును నేతలు సమావేశంలో తీవ్రంగా ఖండించారు.
తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత రిజిస్ట్రేషన్లు
Chandrababu on OTS: ఓటీఎస్ పథకం కింద పేదలెవరూ ప్రభుత్వానికి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుందని సమావేశంలో తీర్మానం చేశారు. తెలుగుదేశం హయాంలో విశాఖలో 52 వేల ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేశామని గుర్తుచేశారు.
రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ దారుణం..
చిరకాల మిత్రుణ్ణి పరామర్శించిన రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ దారుణమని ధ్వజమెత్తారు. కక్షసాధింపు కోసమే స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. చెల్లింపులన్నీ ప్రేమ్ చంద్రారెడ్డి ఎండీగా ఉన్నప్పుడే జరిగాయని ముందు ప్రేమ్ చంద్రారెడ్డినే ప్రశ్నించాలని స్పష్టం చేశారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే స్కిల్ డెవలప్ మెంట్ పై కేసు నమోదు చేశారని ఆరోపించారు.