విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ శ్రీకాకుళం నగరపాలక సంస్థ వద్ద తెలుగుదేశం వినూత్నంగా నిరసన తెలిపింది. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేశారు. ఆమదాలవలస, పలాసలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం లాంతర్లతో నిరసన చేపట్టింది. పాయకరావుపేటలో తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో లాంతర్లు పట్టుకుని బైక్ ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లిలోనూ నిరసనలు కొనసాగాయి. రాజమహేంద్రవరం డీలక్స్ సెంటర్ వద్ద తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆదిరెడ్డి వాసు నేతృత్వంలో తెలుగుదేశం శ్రేణులు వినూత్న నిరసన తెలిపాయి. కొవ్వొత్తులు, పేపర్ పంకాలు పంచిపెట్టారు.
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, టి.నర్సాపురం మండలాల్లో తెలుగుదేశం నాయకులు ఆందోళన చేపట్టారు. దుకాణదారులు, ప్రయాణికులకు కొవ్వొత్తి, అగ్గిపెట్టెలు పంపిణీ చేశారు. ముమ్మడివరం, అనపర్తిలోనూ నిరసనలు కొనసాగాయి. కృష్ణా జిల్లావ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జగ్గయ్యపేట, గుడివాడలోనూ ఆందోళనలు కొనసాగాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ నిరసన ర్యాలీలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.