రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ లేదు కానీ రోజుకో జిల్లా చొప్పున దేవాలయాలపై దాడుల వికేంద్రీకరణ పకడ్బందీగా జరుగుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. డిక్లరేషన్ ఎత్తేయాలని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సీఎం జగనే ఆదేశాలు ఇచ్చారనేది వాస్తవమని ఆరోపించారు. తిరుమల సందర్శనలో అన్యమతస్థుడైన జగన్మోహన్ రెడ్డి స్వామివారిపై విశ్వాసం ఉందంటూ ఏనాడూ డిక్లరేషన్ పై సంతకం చేయలేదని... వైకాపా నేతలు కలియుగ దైవాన్ని కూడా అవమానిస్తున్నారని కళా మండిపడ్డారు.
వైకాపా ప్రభుత్వం హిందూ మత సాంప్రదాయాలను మంటగలుపుతోందని మండిపడ్డారు. ఇప్పుడు ఏకంగా తితిదే చైర్మనే తిరుపతిలో అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారని ధ్వజమెత్తారు. ఏపీ రెవెన్యూ ఎండోమెంట్స్ -1, జీవో ఎంఎస్ నెంబర్- 311, రూల్ నెం.16 ప్రకారం హిందువులు కానివారు తప్పనిసరిగా దర్శనానికి ముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో తమ డిక్లరేషన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. కానీ... గతంలో తితిదేకి ఎవరూ డిక్లరేషన్ ఇచ్చిన సందర్భాలు లేవంటూ వైవీ సుబ్బారెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హిందూ సంప్రదాయాలకు విరుద్ధంగా తితిదే నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమన్నారు.