జగన్ గురించి తెలిసి కూడా ఓట్లు వేసినందుకు.. ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. తెదేపా హయాంలో అభివృద్ధి - సంక్షేమం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ప్రజలపై ఎలాంటి పన్ను వేయలేదని ఆయన గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చేతకానితనంతో సంపద సృష్టించటం తెలియక ప్రభుత్వ భూములు అమ్మకానికి పెడుతున్నారని ఆరోపించారు. జుట్టు మీద తప్ప అన్నింటిపైనా ప్రజలపై పన్నుల భారం మోపారని విమర్శించారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గ తెదేపా సమన్వయ కమిటీ సమావేశంలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఏలూరు వింత వ్యాధి ఘటనకు ఇంతవరకు మూలాలు కూడా చెప్పలేని అసమర్థ ముఖ్యమంత్రి అని దుయ్యబట్టారు. ఎన్నికలకు కరోనా కారణం చెప్తున్న సీఎం వేలాది మందితో బీసీ సంక్రాంతి సభ ఎలా నిర్వహించారని నిలదీశారు. బీసీలకు ఏం ఉద్ధరించారని బీసీల సభ పెట్టారని మండిపడ్డారు. బీసీలకు తీరని అన్యాయం చేశారనే దానిపై చర్చకు సిద్ధమా అని అచ్చెన్నాయుడు సవాల్ చేశారు.