విశాఖలో విజయసాయిరెడ్డి పాదయాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించుకున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. పాదయాత్రతో ప్రజలకు ఒరిగిందేంటని నిలదీశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై వైకాపా నేతలు తప్పును ఒప్పుగా చేసుకునే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రైవేటీకరణపై దిల్లీలో బహిరంగ సభ పెట్టే దమ్ము ఏ1, ఏ2లకు ఉందా అని ప్రశ్నించారు.
'విజయసాయిరెడ్డి పాదయాత్రతో ప్రజలకు ఒరిగిందేంటి?' - విజయసాయిపై తెదేపా నేత విజయసాయి విమర్శలు
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేపట్టిన పాదయాత్రతో ప్రజలకు ఏం ప్రయోజనం చేకూరిందో ఆయన చెప్పాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. చంద్రబాబును తిట్టడానికే విశాఖలో బహిరంగ సభ పెట్టారని వైకాపాపై మండిపడ్డారు.

విజయసాయిరెడ్డి కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకపోవడం ఊసరవెల్లి రాజకీయం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వైకాపా ఎంపీలు ఎందుకు రాజీనామాలు చేయటం లేదన్నారు. విశాఖలో సభ ఉక్కు పరిశ్రమ కోసమా.. చంద్రబాబుని తిట్టడానికా అని మండిపడ్డారు. బాధ్యతల నుంచి తప్పుకోవటానికి తెదేపా మీద నెపం నెడుతున్నారని విమర్శించారు. పోస్కోతో రహస్య ఒప్పందాలు చేసుకుని.. కేసుల మాఫీ కోసం ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి:ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి : నాదెండ్ల