అధికారులు, పోలీసులు బరితెగించి అధికార పార్టీకి సహకరించి ప్రజాస్వామ్యాన్ని కాల రాశారని తెదేపా రాష్ట్ర అధ్యక్ష్యుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇవి బోగస్ పరిషత్ ఎన్నికల ఫలితాలని, ఇవి ప్రజాభిప్రాయం కాదని అన్నారు. ప్రజాభిప్రాయమని వైకాపా భావిస్తే ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా అని సవాల్ విసిరారు. వైకాపా నాయకులు ఏకగ్రీవాల మాటున సాగించిన అరాచకం వర్ణించలేనిదని ధ్వజమెత్తారు. వాటిని ఎన్నికలు అనరన్న అచ్చెన్నాయుడు..అది సెలక్షన్ తప్ప ఎలక్షన్ కాదని ఎద్దేవా చేశారు.
ACHENNA : 'ప్రజాస్వామ్యాన్ని వైకాపా ఖూనీ చేసింది' - TDP state president achennaidu
పరిషత్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని వైకాపా ఖూనీచేసిందని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా తీరు వల్లే పరిషత్ ఎన్నికలను తెదేపా బహిష్కరించిందని అన్నారు. రాష్ట్రంలో చట్టాల ఉల్లంఘన, రాజ్యాంగ ధిక్కరణ జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అడ్డదారుల్లో, అక్రమాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని కబళించేలా వైకాపా నేతలు వ్యవహరించారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ భవిష్యత్ కోల్పోవాల్సి వస్తుందని జగన్ హెచ్చరించడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలపై పడి దండయాత్ర చేశారని విమర్శించారు. అధికారంలో ఉన్నవారు ప్రజలకు ఏం చేశామో చెప్పుకొని ఓట్లు అడుగుతారని..వైకాపా నేతలు మాత్రం బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని, ఇళ్లు కూల్చేస్తామని చెప్పి ప్రజాస్వామ్య విలువలకు పాతరేశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
ఇదీచదవండి.