2019 ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం తొలిసారి జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా పార్టీ ప్రక్షాళనపై మేధోమథనం చేశారు. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించారు. యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న చంద్రబాబు... పార్టీ కమిటీల్లో చోటు కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు యువత, మహిళలతో కొత్త కమిటీలు ప్రకటించనున్నట్లు వివరించారు.
ఈ సమావేశంలో వివిధ అంశాలపై సీనియర్ నేతలు కండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. ప్రజలకు ఆకలైనప్పుడే అన్నం పెట్టాలని... అప్పుడే విలువ తెలిసొస్తుందంటూ... సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇన్నీ చేసినా... ఇంకా ఏదో ఆశించి వారు వైకాపాకు ఓటు వేశారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడే జనంలోకి వెళ్లడం సబబుకాదన్న అయ్యన్నపాత్రుడు... పార్టీ అవసరం ప్రజలకు వచ్చినప్పుడే వెళ్దామని సూచించారు. అధినేత ఎదుట అంతా బాగుందన్న రీతిలో చెప్పే మాటలు ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.
ఇప్పటి నుంచే ఆందోళనలంటూ జనం మధ్యకు పోవాల్సిన పనిలేదని కొందరు నేతలు చెప్పగా... రాజకీయ పార్టీగా నిత్యం ప్రజల మధ్య ఉండటమే సబబని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. స్వార్థపరులకు పదవులు ఇస్తున్నారంటూ మరో సీనియర్‌నేత బుచ్చయ్య చౌదరి అసహనం వ్యక్తంచేశారు. యువతకు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్న గోరంట్ల... శాసనసభాపక్ష ఉపనేత పదవి బీసీలకు ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీతో కలవడం కారణంగా నష్టం జరిగిందని కూన రవికుమార్ చెప్పగా... వితండవాదాలు వద్దని చంద్రబాబు మందిలించినట్లు తెలిసింది.