Yanamala Ramakrishnudu on CM jagan: లంచాలు తీసుకోవడం నేరమని జగన్ మాట్లాడటం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ అని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్ రెడ్డి సామాజిక న్యాయం మాటలకే పరిమితమైపోయిందని.. ఆచరణలో ఏ ఒక్కరికీ న్యాయం చేయలేకపోయారని మండిపడ్డారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేసిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్‌లో దేశంలోనే ఏపీ 20వ స్థానంలో ఎందుకుందని ప్రశ్నించారు. ఆర్ధిక అసమానతలలో రాష్ట్రం 34వ స్థానం నుంచి 43కు ఎందుకు పడిపోయిందని నిలదీశారు. ప్రత్యక్ష నగదు బదిలీలో రాష్ట్ర ర్యాంకు 19వ స్థానానికి ఎందుకు దిగజారిందో జగన్ చెప్పగలరా ? అని సవాల్ విసిరారు.
మూడేళ్ల జగన్ పాలనలో విద్యారంగం పతనావస్థకు చేరుకుందన్నారు. కేంద్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన నేషనల్ ఎచీవ్‌మెంట్ సర్వే 2021 రిపోర్టుతో రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఎంతగా దెబ్బతిందో బట్టబయలైందని విమర్శించారు. జగన్ విధానాలతో దళిత, గిరిజన, బలహీన వర్గాల పిల్లల భవిష్యత్ నాశనం అవుతోందని ఆక్షేపించారు. ఏడాదికి దాదాపు రూ. 57 వేల కోట్లను దారిమళ్లించి ఈ వర్గాలను జగన్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. తెదేపా హయాంలో తలసరి ఆదాయం రెండంకెల్లో ఉంటే.. గత మూడేళ్లలో 1.03 శాతానికి పతనమైందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో స్థిరధరల ప్రకారం జీఎస్డీపీ రెండంకెల వృద్ధి ఉంటే.. వైకాపా పాలనలో నెగటివ్‌కు దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడు ఘనవిజయంతో వైకాపా నాయకుల్లో భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. దావోస్ పర్యటనతో రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏంటో చెప్పకుండా ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించేందుకు జగన్ రెడ్డి లంచం అంశం మాట్లాడుతున్నారని యనమల మండిపడ్డారు.