కరోనాతో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 'సాధన దీక్ష' చేపట్టారు. పార్టీ ఆధినేత పిలుపు మేరకు తెదేపా శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సాధన దీక్ష పేరుతో నిరసన వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లాలో..
కరోనా కట్టడి, వైరస్ బాధితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ విమర్శించారు. చంద్రబాబు సాధన దీక్షకు మద్దతుగా. అవనిగడ్డలో పార్టీ శ్రేణులతో కలిసి సంఘీభావ దీక్ష చేపట్టారు. కరోనా మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులు, చిరు వ్యాపారులు, కూలీలను ఆదుకోవాలని కోరారు.
'వైఎస్ఆర్సీపీ అంటే.. యువత, శ్రామికులు, రైతులను మోసం చేసే కరప్షన్ పార్టీ' అని తెదేపా కార్పొరేటర్ కేశినేని శ్వేత మండిపడ్డారు. పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు విజయవాడ కేశినేని భవన్లో సాధన దీక్ష చేపట్టారు. 'కొవిడ్‌తో ప్రజలు అల్లాడుతుంటే మరోపక్క పన్నులు పెంచిన దుర్మార్గపు ప్రభుత్వం. నిరుద్యోగ యువతను జాబ్ క్యాలెండర్ పేరిట మోసం చేసిన ప్రభుత్వం, రైతులను ధాన్యం కొనుగోలు పేరుతో.. నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం.. వైకాపా ప్రభుత్వం' అని కేశినేని శ్వేతా ఆరోపించారు.
కర్నూలు జిల్లాలో..
నంద్యాల తెదేపా కార్యాలయంలో సాధన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనాతో మృతి చెందిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని ఆదుకోవాలని భూమా బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు. కొవిడ్ లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వారిని గుర్తించి న్యాయం చేయాలన్నారు. దీక్షలో భూమా బ్రహ్మానందరెడ్డితోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో..
ప్రజలకు కరోనా పరిహారం అందకపోతే ఉద్యమం తప్పదని ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ హెచ్చరించారు. కొవిడ్ కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు పిలుపు మేరకు ఇచ్చాపురం బస్టాండ్ వద్ద సాధన దీక్ష చేపట్టారు.
కొవిడ్ బాధితులను ఆదుకోవాలని కోరుతూ తెదేపా శ్రేణులు కాశీబుగ్గలో సాధన దీక్ష నిర్వహించారు. దీక్షలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, నాయకులు పాల్గొన్నారు.
కరోనా బాధితులను అదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి విమర్శించారు. సాధన దీక్షకు మద్దతుగా శ్రీకాకుళం తెదేపా కార్యాలయంలో దీక్ష నిర్వహించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి తక్షణమే రూ. 10 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
తెదేపా అధినేత చంద్రబాబు సాధన దీక్షకు మద్దతుగా.. పాలకొండ పట్టణంలో పార్టీ నాయకులు సంఘీభావ దీక్ష చేపట్టారు. కొవిడ్ బాధితులను ఆదుకోవాలని, లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వారికి పరిహారం అందించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కరివేన అప్పలనాయుడు డిమాండ్ చేశారు.
ప్రకాశం జిల్లాలో..
తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి రూ.10 వేల పరిహారం ఇవ్వాలని తెదేపా నాయకులు మన్నే రవీంద్ర డిమాండ్ చేశారు. చంద్రబాబు చేపట్టిన సాధన దీక్షకు మద్దతుగా యర్రగొండపాలెంలో సాధన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో..
కరోనా బాధితులను ఆదుకోవాలని డిమాండ్‌తో ప్రత్తిపాడులో తెదేపా శ్రేణులు సాధన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పత్తిపాడు నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జ్ వరుపుల రాజా, కాకినాడ పార్లమెంట్ తెదేపా ఇన్ఛార్జ్ జ్యోతుల నవీన్ పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో..
కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ రెడ్డి అనంత కుమారి డిమాండ్ చేశారు. అధినేత పిలుపు మేరకు లంకల గన్నవరంలో చేపట్టిన సాధన దీక్షలో ఆమె పాల్గొన్నారు. 2 రోజుల క్రితం లంకలగన్నవరం వద్ద గోదావరి నదిలో పడి మృతిచెందిన విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ... నాయకులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
విశాఖలో..
రాష్ట్రంలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని తెదేపా రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు. పార్టీ అధినేత చేపట్టిన సాధన దీక్షకు సంఘీభావంగా భీమునిపట్నంలో ధీక్ష చేపట్టారు. 'సాధన దీక్షకు మద్దతు ఇద్దాం.. కరోనా బాధితులకు పరిహారం సాధిద్దాం' అని నినాదించారు. లాక్‌డౌన్‌తో జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడిన చిరు వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులు, పేదలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
అనకాపల్లి పట్టణ పోలీసులు వైకాపా నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని తెదేపా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వర రావు పేర్కొన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన సాధన దీక్షకు మద్దతుగా అనకాపల్లిలో దీక్షకు చేస్తున్న ఏర్పాట్లను పోలీసులు అడ్డుకోవడం పట్ల మండిపడ్డారు. టెంట్ తొలగించడంతో పార్టీ నాయకులంతా గొడుగులు వేసుకొని దీక్షలో కూర్చున్నారు. కరోనా బాధితులు, వారి కుటుంబాలను ఆదుకోవాలని నినాదాలు చేశారు.