ఇసుక కొరతపై తెదేపా రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఇసుక సమస్యపై విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో జనసేనతో పాటు, సీపీఐ, సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తమ సంఘీబావం తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలతో పాటు ప్రజాసంఘాలు, భవన నిర్మాణదారులు, కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. ఇసుక కొరతపై ఈ నెల 14న తెదేపా అధినేత చంద్రబాబు తలపెట్టిన దీక్షకు వివిధ రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.
కార్మికులకు రూ.10 వేలు భృతి
ఈ సమావేశంలో ఏడు అంశాలపై నేతలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న 36 మంది భవన కార్మికులకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 5 నెలలుగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.10 వేలు చొప్పున భృతి అందించాలన్నారు.
రోడ్డు ట్యాక్స్ రాయితీ
భవన నిర్మాణ రంగాన్ని దెబ్బతీసిన అధికార పార్టీ మంత్రులు, శాసనసభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తోన్న ఇసుక లారీలు సీజ్ చేసి, కేసులు నమోదు చేయాలన్నారు. అక్రమ రవాణా అరికట్టాలని డిమాండ్ చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలన్నారు. 6 టైర్ల టిప్పర్లకు ఒక క్వార్టర్ రోడ్డు ట్యాక్స్ రాయితీ ఇవ్వాలన్నారు. డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 13వ తేదీ నాటికి అమలు చేయాలన్నారు.
ఇదీ చదవండి :
'త్వరలో పూర్తిస్థాయిలో ఇసుక సరఫరా చేస్తాం'