‘ఒక యువతిపైనో, మహిళపైనో అత్యాచారం చేసి చంపేశారని తెలిస్తేనే జీర్ణించుకోవడం కష్టం. అలాంటిది జగన్ పాలనలో చిన్న పిల్లలపైనా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అయినా వైకాపా నాయకులు దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం, చిన్న పిల్లలపై అత్యాచారాలు చేసిన దుర్మార్గుల్ని కూర్చోబెట్టి సెటిల్‌మెంట్లు చేసే మంత్రులుండటం ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం’ అని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. ఆడబిడ్డల మాన, ప్రాణాల్ని పోలీసులు కాపాడలేకపోతే, సొంతంగా రక్షణ కల్పించుకునేందుకు వారికి తుపాకి లైసెన్సులైనా ఇవ్వాలని మహిళా నేతలు డిమాండు చేశారు. మహిళలకు రక్షణ కల్పించలేని సీఎం జగన్‌ని వైకాపా నేతలు సింహంతో పోల్చడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చాక మహిళలపై జరిగిన అరాచకాలపై ఇటీవలే ఒక పుస్తకాన్ని ప్రచురించిన తెదేపా.. ఆ తర్వాత జరిగిన ఘటనలతో ‘జగన్‌మోసపురెడ్డి పాలనలో ఊరికో ఉన్మాది-2’ పేరుతో మరో పుస్తకాన్ని ప్రచురించింది. దాన్ని తెదేపా మహిళా నేతలు అనిత, మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి, పార్టీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ, ఆచంట సునీత, అన్నాబత్తుని జయలక్ష్మి పార్టీ కేంద్ర కార్యాలయంలో విడుదల చేశారు.
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి మే 12 వరకు రాష్ట్రంలో మహిళలు, ఆడ పిల్లలపై 60 అత్యాచార, లైంగిక వేధింపుల ఘటనలు జరిగాయన్నారు. ‘గంటా... అరగంటా... అని కామెంట్లు చేసినా తాను బాధపడనని మంత్రి రాంబాబు ట్వీట్ చేశారు. అత్యాచారాలు చేసిన నిందితుల్ని ఆఫీసులో కూర్చోబెట్టి సెటిల్‌మెంట్లు చేసే పరిస్థితికి దిగజారిన మీరు ఎందుకు బాధపడతారు?’ అని అనిత నిప్పులు చెరిగారు. ‘జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు ఏపీని నం.1 చేస్తానని చెబితే... ఉద్యోగావకాశాల కల్పనలోనో, మౌలిక వసతుల అభివృద్ధిలోనో అనుకున్నామే తప్ప... ఇలా నేరాలు, ఘోరాల్లో బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌నీ దాటేసి ఏపీని నం.1 చేస్తారని అనుకోలేదు. జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో వివరాల ప్రకారమే నేరాలు, ఘోరాల్లో దక్షిణ భారతంలో ఏపీ నం.1గాను, మహిళల అక్రమ రవాణాలో దేశంలో నం.2గాను నిలిచింది’ అని ఆమె ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో రాక్షస రాజ్యం: ‘రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సన్నిహితులే మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. మహిళను హోం మంత్రిని చేసినందుకు సంతోషించాలో, అసమర్థ నేతను ఆ పోస్టులో పెట్టినందుకు బాధపడాలో అర్థం కావడం లేదు’. -ప్రతిభాభారతి, తెదేపా నాయకురాలు